close
Choose your channels

వైఎస్ జగన్‌కు ఝలక్.. బీజేపీలోకి జంపింగ్‌లు!

Tuesday, July 16, 2019 • తెలుగు Comments

వైఎస్ జగన్‌కు ఝలక్.. బీజేపీలోకి జంపింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆర్థికంగా అండగా ఉండేవారికి కాషాయ కండువాలు కప్పేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు!. ఇప్పటికే టీడీపీకి ఆర్థికంగా ఆదుకుంటూ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా ఉంటూ వస్తున్న సుజానా చౌదరి, సీఎం రమేశ్ లాంటి ఎంపీలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. ఆ తర్వాత కూడా పలువురు కాంగ్రెస్, టీడీపీ, జనసేనకు చెందిన ముఖ్యనేతలు ఢిల్లీ వేదికగా కండువాలు కప్పేసుకున్నారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే.

ఇక వైసీపీ వంతు!

అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీ నుంచి కూడా జంపింగ్‌లు షురూ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమవ్వగా మరికొందరు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. 2019 ఎన్నికల్లో ఓడిన నేతలే టార్గెట్ బీజేపీ పావులు కదుపుతోందట. గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా పేరుగాంచిన ‘కాపు’ నేతలను పార్టీలో చేర్చుకుంటే 2024 కల్లా బలపడొచ్చని భావిస్తున్నారట.

ఉన్నట్టుండి ఎందుకిలా..!

ఇందులో భాగంగా.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన తోట వాణిని బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ గీశారట. ఇప్పటికే వాణిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం ఇప్పటికే ఆ నియోజకవర్గానికి ఇంచార్జ్‌ను నియమించడం జరిగింది. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాణి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వాణిపై మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. అయితే చినరాజప్ప ఎన్నిక చెల్లదని.. ఆయనపై కేసులు ఉన్నప్పటికీ వాటిని అఫిడవిట్‌లో చూపించలేదని అటు కోర్టుకు.. ఇటు పోలీసులకు ఫిర్యాదులు సైతం చేశారు. ఉన్నట్టుండి వాణి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీలో కలవరం మొదలైంది.

సుజనా నడుపుతున్న తతంగం!!

కాగా.. ఈ తతంగం మొత్తం కేంద్ర మాజీ మంత్రి, టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి నడిపిస్తున్నారని తెలుస్తోంది. సుజనా ద్వారా జాతీయస్థాయి నేతలతో టచ్‌లో వెళ్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి సీనియర్ నేత తోట త్రిమూర్తులు బీజేపీ లేదా వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ఎప్పట్నుంచి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇదే సరైన సమయమని తనతో పాటు అన్న తోట నరసింహులను కూడా తీసుకెళ్లాలని తమ్ముడు భావిస్తున్నారట.

ఇదే జరిగితే జగన్‌కు ఝలకే..!

సో.. తోట వాణి నిజంగానే వైసీపీని వీడితే మాత్రం ఇది జగన్‌కు పెద్ద ఝలక్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె పార్టీ మారిన తర్వాత ఇంకెంతమంది పార్టీ మారతారో అనే టెన్షన్ ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో మొదలైందట. అయితే ఇంత వరకూ ఈ వ్యవహారంపై తోట వాణి మాత్రం సోషల్ మీడియాలో గానీ.. కనీసం మీడియా ముందుకు కూడా వచ్చి స్పందించకపోవడంతో అందరూ ఇదే నిజమని భావిస్తున్నారు. ఈ విషయం అధిష్టానం పట్టించుకుని సీరియస్‌గా తీసుకుని అడ్డుకుంటుందా..? లేకుంటే మిన్నకుండిపోతారో అనేది తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz