close
Choose your channels

YS Sharmila:కాంగ్రెస్ చేపట్టిన 'ఛలో సెక్రటేరియట్'లో ఉద్రిక్తత.. వైయస్ షర్మిల అరెస్ట్..

Thursday, February 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దగా డీఎస్సీ కాదు..మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ ఏపీ సచివాలయానికి ఆమె కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. అయితే కొండవీటి ఎత్తిపోతల వద్దకు రాగానే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షర్మిలను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసే సమయంలో షర్మిల చేతికి స్వల్ప గాయాలయ్యాయి.

అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మీద షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన ఘటనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని.. ఈ ఘటనపై విజయమ్మ కూడా బాధపడుతుందన్నారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం నిరుద్యోగుల కోసమేనని తెలిపార. ఈ ప్రభుత్వంలో కనీసం సచివాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. సచివాలయానికి సీఎం రాడని మంత్రులు, అధికారులు కూడా రారంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఉన్న నేతలకు పాలన చేతకాదనీ.. బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదని ఆరోపించారు.

అంతకుముందు మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో సెకట్రేరియట్‌' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. వైయస్ షర్మిల బయటకు రాకుండా విజయవాడలోని కాంగ్రెస్ పోలీసులు భారీగా చుట్టుముట్టారు. మరోవైపు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో పార్టీ అభిమానుల నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల తీరుతో ఆఫీసులోనే షర్మిల సహా ఇతర నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

"23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 23వేలు ఖాళీగా ఉన్నప్పుడు 7వేల ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు 6వేల ఉద్యోగాలే ఎందుకు వేశారు. మరి మీ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా. మీ కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలిచ్చారు. ఆయన కంటే ఘోరం అని మిమ్మల్ని మీరే నిరూపించారు. మాట తప్పం..మడమ తిప్పం అన్నవారు..ఇప్పుడు మాటను మడతపెట్టారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వమంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలి. మీరు సీఎం అయినప్పుడు 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. 30వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి" అని విమర్శించారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.