Manchu Vishnu:అన్నదమ్ముల్నే విడదీశాడే .. ఎవరీ సారథి, అతనిని మంచు విష్ణు ఎందుకు కొట్టాడు..?
Send us your feedback to audioarticles@vaarta.com
మంచువారి వారసులు.. విష్ణు, మనోజ్‌ల కొట్లాట తెలుగు చిత్ర సీమలో కలకలం రేగింది. క్రమశిక్షణకు , డిసిప్లిన్‌కు మారుపేరైన మోహన్ బాబు ఇంట్లో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి వుండరు. ఈ నేపథ్యంలో అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగి వుండొచ్చనే ఆరాలు మొదలయ్యాయి. సహజంగానే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో వేలు పెట్టే మీడియా మోహన్ బాబు కుటుంబంలోకి మరింత చొచ్చుకెళ్తోంది. అన్నాదమ్ముల మధ్య తొలి నుంచి సఖ్యత లేదని ఈ సంఘటనతో తేల్చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో వుండటం ఇష్టం లేక మనోజ్ కొంతకాలం అక్క లక్ష్మీ ప్రసన్న దగ్గర ఇంకొంతకాలం చెన్నైలో గడిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతా బాగానే వుంది కానీ ఈ సోదరుల మధ్య ఎందుకు, ఎక్కడ, ఎలా చెడిందన్నది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. ఇప్పటికే మోహన్ బాబు రంగంలోకి దిగి మ్యాటర్ సెటిల్ చేసే పనిలో వున్నారు.
మోహన్ బాబుకు తొలి నుంచి అండగా నిలిచిన సారథి:
కాగా.. అసలు విష్ణు కొట్టడానికి వెళ్లిన సారథి ఎవరు.. అతడిని ఎందుకు కొట్టాల్సింది..? అంటూ సినీ జనాలు, ప్రేక్షకులు ప్రశ్నించుకుంటున్నారు. అయితే ఫిలింనగర్‌లోని చాలా మందికి సారథి కొత్త కాదు. మోహన్ బాబు వెంట వున్న అతను మంచు కుటుంబానికి నమ్మిన బంటు. ఆ ఫ్యామిలీకి అన్ని అవసరాల్లో చేదోడు వాదోడుగా వుంటూ వస్తున్నారు . తొలుత మోహన్ బాబుకు ఆ తర్వాత విష్ణుకు తల్లో నాలుకలా వుంటూ వస్తున్నాడు. అలాంటి సారథి గత కొన్నిరోజులుగా మనోజ్‌తో క్లోజ్‌గా వుండటాన్ని విష్ణు జీర్ణించుకోలేకపోతున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కుటుంబంలో సారథి గొడవలు పెడుతున్నాడన్న విష్ణు :
తమ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడని, తన గురించి అనుచితంగా మాట్లాడుతున్నాడంటూ సారథిపై విష్ణు గుర్రుగా వుంటున్నాడట. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సారథి ఇంటికి వెళ్లిన విష్ణు.. అతనిని చావబాదినట్లు తెలుస్తోంది. దీంతో సారథి కుటుంబ సభ్యులు.. మనోజ్, లక్ష్మీ ప్రసన్నలకు విషయం తెలియజేశారు. అయితే అప్పటికే సారథిని విచక్షణారహితంగా కొట్టాడు విష్ణు. ఎంతగా సర్దిచెప్పినా వినకపోవడంతో అన్నయ్యపై భగ్గుమన్నాడు మనోజ్. వెంటనే సెల్‌లో ఈ తతంగమంతా రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అయితే మోహన్ బాబు జోక్యం చేసుకుని సదరు వీడియోను డిలీట్ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో కొడుకులకు సర్దిచెప్పే పనిలో వున్నారు పెదరాయుడు. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments