close
Choose your channels

కోలీవుడ్‌ నటులకు ఏమైంది.. ఈ వివాదాలేంటి!?

Saturday, May 9, 2020 • తెలుగు Comments

కోలీవుడ్‌ నటులకు ఏమైంది.. ఈ వివాదాలేంటి!?

కోలీవుడ్ నటులు వివాదాల్లో మునిగి తేలుతున్నారు. వివాదాలంటే దూరంగా ఉండే నటులు సైతం అదెలా ఉంటుందో చూడాలని ఇలా చేస్తున్నారేమో కానీ ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో నానుతున్నారు. కొందరు నటులు కరోనా కష్టకాలంలో సేవలు చేస్తూ వారి మంచి మనసును చాటుకుని వార్తల్లో నిలుస్తుంటే.. ఇంకొందరేమో ఇలా వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది..? ఎందుకిలా వివాదాల్లో కాలెడుతున్నారు..? వారిపై అభిమానులు, నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

కొందరు ఇలా.. ఇంకొందరు అలా!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధించింది. దీంతో సినిమా పరిశ్రమలో కూడా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్లు కూడా బంద్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు తమ వంతుగా కష్టాల్లో పేదలు, సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా ఎవరెవరు సహాయసాకారాలు చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే కొందరు మాత్రం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. విలక్షణ నటుడు, సీనియర్ హీరో కమల్ హాసన్, హీరో విజయ్ సేతుపతి ఇద్దరూ ఇప్పుడు ప్రాంతీయ మీడియా మొదలుకుని జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.

కమల్ వివాదమేంటి!?

త్యాగ‌రాజ‌స్వామిని ఉద్దేశిస్తూ కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ‘సినిమా టిక్కెట్లను అమ్మి డ‌బ్బు సంపాదించే వ్యాపారం కాదు.. ఛారిటీ కాదు. తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ త్యాగ‌రాజులా బిచ్చమెత్తుకోవడం కాదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల‌పై రాష్ట్రంలో తీవ్ర నిర‌స‌న వ్యక్తం అవుతోంది. వాస్తవానికి త్యాగ‌రాజుస్వామిని క‌ర్ణాట‌క సంగీత కారులు దైవంలా కొలుస్తారన్న విషయం విదితమే. వీరంతా కమల్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. క‌మ‌ల్ క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని కోరుతూ సంగీత క‌ళాకారుడు పాల్ఘాట్ రామ్‌ప్రసాద్ ఆన్‌లైన్‌లో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్‌కు మ‌ద్దతుగా 16 వేల మంది సంత‌కాలు చేసేశారు. ఇటు తమిళనాడులో.. అటు కర్ణాటకలో కమల్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కమల్‌ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేమీ కొత్త కాదు.. పెద్ద పెద్ద రాజకీయ నేతలు మొదలుకుని ఆఖరికి దేశ ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఈ విలక్షణ నటుడు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్.

విజయ్ సేతుపతి వివాదం ఇదీ..!?

విజయ్ సేతుపతికి మంచి నటుడని.. ఎవరి జోలికీ పోకుండా తన పనేంటో తాను చేసుకుని పోతుంటాడనే పేరుంది. అయితే ఎప్పుడూ ఒకేలాగా ఉండాలా..? అని అనుకున్నాడేమో కానీ ఈ మధ్య వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన.. హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబట్టారు. ఆయన చేసిన తీవ్ర దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా? అని మహాసభ కన్నెర్రజేసింది. మరోవైపు.. నెటిజన్లు, హిందూ సంఘాలు కూడా సోషల్ మీడియా వేదికగా సేతుపతిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే ఈ ఇద్దరూ కూడా ఈ వివాదాలపై ఇంతవరకూ స్పందించలేదు. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇలా చేయడం వల్ల పది మంది నోళ్లలో నానుతారే తప్ప ప్రయోజనమేమీ లేదని.. మీ మీ విలువైన సమయాన్ని మంచి మంచి పనులు చేయడానికి వెచ్చించాలని.. ఇప్పుడు అసలే కరోనా కష్టకాలం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz