close
Choose your channels

అడ్డంగా బుక్కయిన విరాట్ కోహ్లీ!

Monday, March 2, 2020 • తెలుగు Comments

అడ్డంగా బుక్కయిన విరాట్ కోహ్లీ!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు, మైదానంలో అతి చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో తిట్టిపోశారు. అయితే తాజాగా.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ ఔట్ అయినప్పుడు మైదానంలో కోహ్లీ విచిత్రంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో దూషించడం, ప్రేక్షకులకు వేలు చూపించడం వంటి వ్యవహారాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అంతేకాదు.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కూడా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు.

అసలేం జరిగింది..!
మూడో రోజు ఆటలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అన్న మాట ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఒకట్రెండు సార్లు కాదు పదే పదే ఈ మాట అనడంతో ఆయనపై క్రీడాభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘జబ్ ఇండియా మే యే లోగ్ ఆతేంగే.. తబ్ దిఖా దూంగా’ అంటే.. ‘వీరు ఇండియా వస్తారుగా.. అప్పుడు చూపిస్తా’ అని అర్థం. ఇలా పదే పదే అరుస్తూ విరాట్ అడ్డంగా బుక్కయ్యాడు.

మీడియాకే వార్నింగ్..
విరాట్‌ను ప్రశ్నించిన విలేకర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అంతేకాదు ఒకింత వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు కూడా. ‘విరాట్.. మైదానంలో మీ ప్రవర్తనకు ప్రతిస్పందన ఏమిటి? విలియమ్సన్ అవుటైనప్పుడు అసభ్యపదజాలం ఉపయోగించారు. అలాగే, ప్రేక్షకులను కూడా ఏదో అన్నారు. ఇండియా కెప్టెన్‌గా మీరు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం లేదా?’ అని మీడియా ప్రశ్నించింది. ఇందుకు జరిగిన విషయం చెప్పాల్సిన కోహ్లీ.. మ్యాచ్ ఓడిపోయాని ఫుల్ ప్రస్టేషన్‌తో ఉన్నాడేమో.. ఇష్టానుసారం మాట్లాడేశాడు. ‘అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని సరైన ప్రశ్నలతో రావాలి. సగం సగం ప్రశ్నలు, సగం వివరాలతో ఇక్కడికి రాకూడదు. ఒకవేళ మీరు వివాదం సృష్టించాలనుకుంటే అందుకు ఇది సరైన వేదిక కాదు. నేను మ్యాచ్‌ రిఫరీతో మాట్లాడాను. సమస్యేమీ లేదు’ చెప్పాల్సింది చెప్పేసి.. లాస్ట్‌లో థ్యాంక్యూ.. అని తిన్నగా మీడియా ముందు నుంచి వెళ్లిపోయాడు.

ఎందుకిలా..?
అయితే పేరుమోసిన.. టీమిండియా సారథి అయిన విరాట్ ఈ మధ్య ఎందుకిలా చేస్తున్నాడు..? వివాదాలకు దూరంగా ఉండే ఆయన పదే పదే ఎందుకిలా చేస్తున్నాడు..? గెలుపోటములు సహజమే కానీ.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు..? ఆయన మాటలేంటి..? గొనుగుడేంటి..? పైగా వార్నింగ్‌లు కూడా..? మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక వారిపై కూడా రుసరుసలాడటమేంటి..?. ఆయన వీరాభిమానులే.. ఆయన చేస్తున్న పనులకు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విరాట్ ఎందుకింతలా సహనం కోల్పోతున్నాడో.. ఆయనకు.. అనుష్కకే తెలియాలి మరి.

Get Breaking News Alerts From IndiaGlitz