close
Choose your channels

చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..

Monday, September 7, 2020 • తెలుగు Comments

చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అటు ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. ఇటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు. 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ గతంలో హార్స్ పవర్ విద్యుత్‌ను 50 రూపాయలకే ఇచ్చి నిరుపేద కుటుంబాలు పైకి రావడానికి కారణం అయ్యారని వల్లభనేని వంశీ కొనియాడారు. తరువాత దివంగత నేత వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ వల్లనే వ్యవసాయం బతికిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బషీర్‌బాగ్ ఉదంతాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో కరంట్ చార్జీలు పెంచారన్నారు. బషీర్ బాగ్‌ కాల్పులకు కారణం అయ్యారని దుయ్యబట్టారు. 2004లో టీడీపీ కరంట్ చార్జీల వల్లనే ఓటమి పాలైందని విమర్శించారు. పాదయాత్రలో రైతుల బాధలు చూసి వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారన్నారు. ఆయన మరణానంతరం ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పడిందని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. 30 ఏళ్ళ పాటు రైతులకు ఇబ్బంది ఉండకూడదని కేంద్ర సంస్కరణలను జగన్ అందిపుచుకున్నారని కొనియాడారు. పెన్షన్లు, జీతాల వలే.. ఉచిత కరంట్ డబ్బులు కూడా అకౌంట్‌లో పడతాయని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. తాము స్కూల్‌కు వెళ్లక ముందే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారని వెల్లడించారు.

రైతులకు నిధుల బదిలీ పథకానికి ఉరి వేసినట్లు ఎలా అవుతుందని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నేత ఆయన కుమారుడు లోకేష్‌లా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు ఆయనకు మతి భ్రమించిందమో అనుకునేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు కొడుకు ఏమో గేరు వెయ్యలేక.. ఎక్సలేటర్ తొక్కలేక పోతున్నారని వంశీ విమర్శించారు.

చంద్రబాబు దగ్గర బిర్యానీ పొట్లాలకు ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీకి జగన్ ఒక్కరే నాయకుడని... గన్నవరంలో ఒకరే నాయకుడున్నారు. తాను నాయకత్వం తీసుకున్నానని... అందరిని కలుపుకుని వెళ్తానని వంశీ తెలిపారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడానికి సైతం తాను సిద్ధమని... కానీ ఇప్పడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని గ్రూపులను కలుపుకుని వెళ్లే అనుభవం తనకు ఉందన్నారు. ప్రజా జీవితంలో లేని వారి వల్ల వైసీపీకీ, తనకూ జరిగే నష్టమేమీ లేదన్నారు. తాను వైసీపీ లోకి వెళ్ళాను కాబట్టి కొంత తగ్గాల్సి వస్తుందని.. అందులో తప్పు లేదని వల్లభనేని వంశీ పేర్కొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz