close
Choose your channels

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గం ఇదే..

Wednesday, February 21, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భీమవరం పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. భీమవరం పర్యటనకు వచ్చిన సేనానికి అభిమానులు, టీడీపీ-జనసేన కార్యర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా మాజీ రాజ్యసభ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. తన గెలుపునకు టీడీపీ నేతలు సహకరించాలని కోరారు.

ఈ భేటీలో టీడీపీ నేతలు పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంటికి వెళ్లారు. భీమవరం నుంచి టీడీపీ తరపున సీటు ఆశిస్తున్న రామాంజనేయులును కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత పాక సత్యనారాయణతో భేటీ అయ్యారు. తాజాగా రాజకీయాలపై వారితో చర్చించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్‌ అని.. మనుషులను విడగొట్టే ఆయన విషసంస్కృతి కుటుంబాల్లోకి కూడా వెళ్లిపోయిందని.. వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్‌ నైజం అని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశాడని.. అలాంటి వాడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఘనస్వాగతం పలికారని విమర్శించారు. సమాజానికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగివస్తుందని.. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని తెలిపారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకు? అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని... మీరు సిద్ధం అంటే.. మేం యుద్ధం అంటామని హెచ్చరించారు.

అయితే భీమవరం పర్యటనలో ఉండగానే పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన తన పర్యటనను త్వరగా ముగించుకుని హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కాగా గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్‌కు 62,285 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ది గ్రంథి శ్రీనివాస్‌కు 70,642 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి టీడీపీతో పొత్తు ఉండటంతో భీమవరం నుంచి పోటీ చేస్తే పవన్ గెలుపు సులభం అని పార్టీ నేతలు అంచనా వేశారు. దీంతో ఓడిన చోట నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారట. అలాగే రెండో నియోజవర్గంగా రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos