close
Choose your channels

Sonia Gandhi:కాంగ్రెస్‌లో ముగిసిన సోనియా శకం : రాజకీయాలకు అధినేత్రి గుడ్‌బై..  ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటన

Saturday, February 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూడు దశాబ్ధాలుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు టర్నింగ్ పాయింట్ అన్న ఆమె.. యాత్రతో తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసిందన్నారు. దేశానికి, కాంగ్రెస్‌కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివని సోనియా గాంధీ అభివర్ణించారు. పదేళ్ల యూపీఏ పాలన తనకు సంతృప్తినిచ్చిందని.. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని సోనియా అన్నారు. మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో వచ్చే ఎన్నికలు సిద్ధం కావాలని శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని.. అన్ని సంస్థలను గుప్పెట్లో పెట్టుకుందని సోనియా గాంధీ ఆరోపించారు. కొంతమంది వ్యాపారవేత్తలకు కేంద్రం అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్ధిక పతనానికి కారణమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు.

దేశ రాజకీయాల్లో ముగిసిన శకం:

ఇకపోతే.. సోనియా గాంధీ రిటైర్మెంట్‌తో కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయ్యింది. విదేశీ వనిత అన్న వ్యాఖ్యలతో పాటు సూటి మాటలను ఎదుర్కోని, పురుషాధిక్య సమాజంలో దేశాన్ని కనుసైగతో శాసించారు సోనియా గాంధీ. దశాబ్ధాల పాటు కాంగ్రెస్‌కు అన్నీతానై వ్యవహఱించారు. ఒకానొక దశలో కుమారుడు రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసినా, వయోభారం, అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా తానే బాధ్యతలు తీసుకున్నారు. దేశ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ వదులుకున్నారు.

ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ:

ఇటలీలోని లూసియానాలో 1946 డిసెంబర్ 9న జన్మించారు సోనియా గాంధీ . ఆమె అసలు పేరు సోనియా మైనా. కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 1968లో హిందూ సంప్రదాయం ప్రకారం రాజీవ్-సోనియా పెళ్లి జరిగింది. ఈ దంపతులకు రాహుల్ , ప్రియాంకలు జన్మించారు. పెళ్లి , పిల్లలతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఇందిరా గాంధీ హత్య పెద్ద కుదపు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన కూడా హత్యకు గురికావడంతో సోనియా ఒంటరి అయ్యారు. ఇదే సమయంలో క్రియాశీలక రాజకీయల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని శ్రేణులు డిమాండ్ చేసినప్పటికీ ఓపిక పట్టారు. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి అడుగుజాడల్లో నడిచారు. అప్పటికీ ఆమె కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు.

2004-09 మధ్య అత్యంత శక్తివంతమైన మహిళగా సోనియా :

అయితే 1996 ఎన్నికల్లో పార్టీ ఓటమి, అంతర్గత కుమ్మలాటల నేపథ్యంలో 1998లో దేశంలోని అతి పురాతన పార్టీకి అధినేత్రి అయ్యారు. అయితే 1999లో ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే అంశంలో విభేదాలతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌లు కాంగ్రెస్‌ను వీడారు. ఒక విదేశీ వనితకు ప్రధాని పదవిని ఎలా కట్టబెడతారంటూ వారు విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ అన్ని పార్టీలను కూడగట్టుకుని 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని పదవిని సైతం వదులుకుని మన్మోహన్ సింగ్‌ని ఎంపిక చేశారు. 2009లోనూ మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తిరుగులేని నేతగా, దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా సోనియా గాంధీ నిలిచారు. అయితే 2014, 2019లలో కాంగ్రెస్ వరుస పరాజయాలు చవి చూసింది. దీంతో సీనియర్లు ఎదురు తిరిగారు. కుమారుడు పార్టీ అధ్యక్ష పదవిని త్యజించినా.. వయోభారంతో బాధపడుతున్నా సోనియా గాంధీ నేటి వరకు కాంగ్రెస్‌ను నడిపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.