close
Choose your channels

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

Sunday, February 6, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

దిగ్గజ నేపథ్య గాయని, భారతరత్న లత మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతాజీ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో లతా మంగేష్కర్‌ను జనవరి 8న ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.

అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు లతాజీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే నిన్న లతాజీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

మరాఠా థియేటర్‌ యాక్టర్‌, క్లాసికల్‌ సింగర్‌ అయిన పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్‌ 28న లతా మంగేష్కర్‌ జన్మించారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్‌, హృదయనాథ్‌ మంగేష్కర్‌, మీనా కదికర్‌లు లత మంగేష్కర్‌కు తోబుట్టువులు. తండ్రి శిక్షణలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లతాజీ ఐదేళ్ల ప్రాయంలోనే పాటలు పాడటం మొదలుపెట్టారు. 1942లో ‘కిటీ హసాల్‌’ కోసం ఆమె పాడిన పాటను ఎడిటింగ్‌లో పక్కనపెట్టాల్సి వచ్చింది. తర్వాత ‘పెహలీ మంగళాగౌర్’‌(1942)లో ‘నటాలీ చైత్రాచీ’ హిందీలో ‘మాట ఏక్‌ సపూట్‌కి దునియా బదల్‌దా తు’ , మరాఠీ చిత్రం ‘గజబావూ’ కోసం పాడారు.

దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడిన లతా మంగేష్కర్.. తెలుగులో 1955లో ఏఎన్ఆర్ నటించిన సంతానం సినిమాలో నిదుర ‘‘పోరా తమ్ముడా’’, 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో ‘‘శ్రీ వేంకటేశ’’ , 1988లో నాగార్జున నటించిన ఆఖరి పోరాటం సినిమాలో ‘‘ తెల్ల చీర’’కు పాట పాడారు. 1948 నుంచి 1978 మధ్యకాలంలో 50 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు. గానకోకిల అనే బిరుదును అందుకున్నారు. సినీ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను సత్కరించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.