close
Choose your channels

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఫిక్స్..!

Friday, December 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఫిక్స్..!

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పేరు ఫిక్స్ అయిందా? అంటే ఆ పార్టీ నేతల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మెజారిటీ పార్టీ నేతల నిర్ణయం మేరకు రేవంత్‌రెడ్డిని నియమించాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్‌కి ఎదురు నిలవగలిగే సత్తా ఒక్క రేవంత్‌కే ఉందని భావించడంతో పాటు.. ప్రజాకర్షక నేత కావడం, క్షేత్రస్థాయిలో ఆయనకే అనుకూలంగా మద్దతు తెలపడం వంటి కారణాల నేపథ్యంలో అధిష్టానం రేవంత్‌కే ఓటు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా ఉన్న సీనియర్ నేతల్లో అసంతృప్తి వెల్లువెత్తకుండా వారికి కూడా తగు ప్రాధాన్యమివ్వనున్నారు. కాగా.. చివరి వరకూ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా చోటు కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాగా.. టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్‌ను ఏఐసీసీలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

ఎస్సీ కోటాలో సంపత్‌కుమార్‌, బీసీ కోటాలో మధుయాష్కీగౌడ్‌, మైనారిటీ కోటాలో షబ్బీర్‌ అలీని అధిష్టానం కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎన్నికల ప్రచార కమిటీని సైతం నియమించేందుకు అధిష్టానం సమాయత్తమవుతోందని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన భట్టి విక్రమార్కకే.. మళ్లీ ఆ పదవి అప్పగించనున్నట్లు చెబుతున్నారు. అలాగే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సైతం ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అధిష్టానం ఆఫర్ చేసిందని సమాచారం. మరి వీరిద్దరిలో ఎవరికి చైర్మన్ పదవి దక్కుతుందో చూడాలి. టీపీసీసీ రేసులో ఉన్న మరో నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును సీఎల్పీ నేతగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో మార్పులు చేర్పులు సైతం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎవరికీ అసంతృప్తి లేకుండా చూసుకునేలా అధిష్టానం వ్యవహరిస్తోంది.

సీనియర్‌ నేతలైన ఉత్తమ్‌, జానారెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌కు టీపీసీసీ సలహా కమిటీని ఏర్పాటు చేసి అందులో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాహుల్‌గాంధీతో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుందని సమాచారం. కాగా.. టీపీసీసీ రేసులో ఉన్న నేతలు మాత్రం ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఠాగూర్‌తో ఎంపీ కోమటిరెడ్డ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సహ ఇన్‌చార్జి బోస్‌రాజు కూడా ఠాగూర్‌తో సమావేశమై మంతనాలు జరిపారు. పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ, సీనియర్‌ నేత మహేష్‌ గౌడ్‌.. ఠాగూర్‌తో సమావేశమై అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.