close
Choose your channels

త్రివిక్రమ్ సినిమాల్లో ‘స్త్రీలు, ఇళ్లు’ పైనే ఫోకస్ ఎందుకు!?

Friday, January 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రివిక్రమ్ సినిమాల్లో ‘స్త్రీలు, ఇళ్లు’ పైనే ఫోకస్ ఎందుకు!?

‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ నుంచి జనం ఒక కంప్లీట్ ఫీలింగ్‌తో, ఆనందంతో బయటకు వస్తారని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య తన సినిమాల్లో ఎక్కువగా స్త్రీలపై గౌరవాన్ని పెంచే పాత్రలు, కథ ఒక ఇంటిచుట్టూ నడవడం కనిపించింది. ఈ విషయమై మాటల మాంత్రికుడ్ని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా చాలా లాజిక్‌గా ఆయన సమాధానమిచ్చారు.

మీడియా : ఈ మధ్య మీ సినిమాల్లో స్త్రీలపై గౌరవాన్ని పెంచే పాత్రలు కనిపిస్తున్నాయి.. కాన్షియస్‌గానే ఆ పాత్రలకు ప్రాముఖ్యం కల్పిస్తున్నారా!?

త్రివిక్రమ్: ‘1950ల నుంచి 1970 దాకా కూడా ఇంట్లో స్త్రీలే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్లు. అంటే పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం ఉండేది. ఇంటికి సంబంధించిన అన్ని పనులూ వాళ్ల ద్వారానే నడిచేవి. ‘70ల తర్వాత ప్రయాణాలు పెరిగి, ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాల్సి రావడం వల్ల ఇళ్లల్లో వాళ్ల భాగస్వామ్యం తగ్గింది. తెలీకుండా మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమవడం, మన మూలాల్ని మనం వదిలేయడం, దాంతో వాళ్లను అగౌరవపరిచేవిధంగా చూడటం, అలా మనం మగవాళ్లమే చూడ్డం వల్ల, లేని ఒక యాక్సెప్టెన్స్ రావడం, వాళ్లు మౌనంగా ఉండటాన్ని కూడా మనం యాక్సెప్టెన్స్ కింద చూడ్డం వంటివి 35 ఏళ్లు నడిచాయి. నాకు తెలిసి ఇప్పుడవి మారిపోయాయి. ‘అత్తారింటికి దారేది’ అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని, తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. పెళ్లిలో అల్లుడ్ని విష్ణువుగా చూస్తాం. అందుకే కాళ్లు కడుగుతాం. అంటే అల్లుడి బాధ్యతను పెంచడం కోసం అతని కాళ్లు కడుగుతాం. అలాంటివాడు అత్తతోటి ఎలా వేళాకోళమాడతాడు? అతను దేవుడిలాగే బిహేవ్ చెయ్యాలి. అందర్నీ బాగా చూసుకోవాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. కాన్షియస్గా నేను వాటిని చెప్పాననట్లేదు’ అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

మీడియా: ఇటీవల మీ సినిమాల్లో కథ ఒక ‘ఇంటి’ చుట్టూ నడవడం కనిపిస్తోంది.. ఎందుకలా!?

త్రివిక్రమ్ : ‘మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే ‘హోం కమింగ్’ అంటాం. మనకు తెలియకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో ‘వైకుంఠపురం’ అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్‌గా పెట్టాను. ‘అల వైకుంఠపురములో’ అని పేరు పెట్టడానికి పోతన గారి పద్యమే స్ఫూర్తి’ అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.