close
Choose your channels

'ఆర్ఆర్ఆర్' విజువల్ వండర్ వెండితెర పైనే చూడాలి, ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు : ఎన్టీఆర్

Thursday, May 13, 2021 • తెలుగు Comments

ఆర్ఆర్ఆర్ విజువల్ వండర్ వెండితెర పైనే చూడాలి, ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తారక్ పంచుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరుస్తాయని.. అదొక విజువల్ వండర్ అని.. ఆ సినిమాను వెండితెరపై మాత్రమే చూడాలని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల చేయబోమని వెల్లడించాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పాన్‌ ఇండియా సినిమా అనే కంటే భారతీయ సినిమా అనడం నాకు ఇష్టం. పాన్‌ అనే పదం విన్నప్పుడల్లా నాకు ఇంట్లో వంటపాత్ర గుర్తుకొస్తుందని తారక్ పేర్కొన్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ గురించి తారక్ మాటల్లోనే..

అదొక ఎమోషన్..

కొవిడ్ చాలా నిరాశపరిచింది. నా మొదటి సినిమాలో నటించినప్పుడు నాకు 17 ఏళ్లు. అప్పటి నుంచి ఎప్పటికీ నేను 365 రోజులు పనిచేయడానికి ఇష్టపడతాను. ఇక ఇంట్లో బంధీగా ఉండటం ఇదే చివరి సారి కావాలని భావిస్తున్నా. అయితే ఇంటిపట్టునే ఉండాల్సి రావటంతో కుటుంబంతో గడపటానికి వీలు కుదిరింది. అమ్మా, భార్య, పిల్లలతో గడపడం అనేది ఒక ఎమోషన్‌. మొత్తం మీద చూస్తే ఇదొక భావోద్వేగాల కలబోతలా ఉంది.

ఇదొక సుదీర్ఘ ప్రయాణం..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జర్నీ 2018 నవంబర్‌లో మొదలైంది. ఇదొక సుదీర్ఘ ప్రయాణం. జక్కన్న పరిపూర్ణత లేకపోతే ఏ పని చేయరు. అందుకే ఆయన చిత్రాలు చాలా సమయం తీసుకుంటాయి. బాహుబలి టు పార్ట్స్ కోసం జక్కన్న ఐదేళ్లు తీసుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే కరోనా కారణంగా మేము 8 నెలల పాటు షూటింగ్ చేయకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. మెజారిటీ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలల పాటు షూటింగ్ వాయిదా పడిందంతే. అయినా అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయటానికి ఇంకా అవకాశం ఉంది.

అదొక ఆశాకిరణంలా అనిపించింది

బడ్జెట్ పరంగా కానీ.. కథ పరంగా కానీ ఏదీ మారలేదు. కానీ మేము పని చేసే వేగం మాత్రం మారిపోయింది. కరోనా ఎఫెక్ట్ మరోసారి పడకముందే మేము షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాం. దీనికోసం రేయింబవళ్లు పని చేశాం. కరోనా కారణంగా సినీ పరిశ్రమ చాలా దెబ్బతిన్నది. మాకు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం అందలేదు కానీ గతంలో ఆంక్షలు ఎత్తివేశాక ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు రావడం ఒక ఆశాకిరణంలా అనిపించింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు. ఈ సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే. ఓటీటీలో బాహుబలి, జురాసిక్ పార్క్, ఎవెంజర్స్ వంటి సినిమాలను చూడగలరా? ‘ఆర్ఆర్ఆర్’ కూడా అంతే. ఇదొక విజువల్ వండర్. వెండితెరపై చూడాల్సింది.

దేశాన్ని ఒక్కటి చేశాడు

రాజమౌళితో నాలుగో సినిమా ఇది. 2001లో మేమిద్దరం తొలిసారి కలసి ప్రయాణించాం. అప్పట్లో నాకూ అంత అవగాహన లేదు, ఆయనకూ లేదు. కానీ భారతీయ సినిమాల్లో ఏదో సాధించాలనే పెద్ద ఆలోచనలు ఆయనకు ఉండేవి. ఇప్పటికీ ఆయనలో అదే స్ఫూర్తి. రాజమౌళి పెద్ద టాస్క్‌ మాస్టర్‌. ఆయన ‘బాహుబలి’ రెండు భాగాలను ఐదేళ్లపాటు చెక్కాడు. అందుకే జక్కన్న పేరును ఆయనకు బిరుదుగా ఇచ్చాను. ‘బాహుబలి’తో దేశంలోని అన్ని మార్కెట్లను తెరిచాడు. తన చిత్రాలతో దేశాన్ని ఒక్కటి చేశాడు. తెలుగు ప్రాంతీయ చిత్రంతో దేశం మొత్తంలోనే కాకుండా చైనా, బ్రిటన్‌, అమెరికాలాంటి విదేశాల్లోనూ ఆదరణ దక్కించుకున్నాడు. ఇలాంటి పెద్ద సినిమాలో భాగమైనందుకే కాదు, రాజమౌళి లాంటి ఆత్మీయుణ్ణి సంపాదించుకున్నందుకు గర్వపడుతున్నా.

దర్శకత్వం ఆలోచన లేదు...

సినిమాల్లో యాక్ట్‌ చేయడమే తప్ప దర్శకత్వం వైపు ఇప్పటి వరకూ ఆలోచించలేదు. మంచి కథ ఉంటే నిర్మాతగా వ్యవహరిస్తా. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోనే కంటెంట్‌ను సృష్టించాలనే కోరిక ఉంది.

అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు?

హాలీవుడ్‌లో అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. నేను కూడా అంతే! ప్రస్తుతం మన సినిమాలతో నేను హ్యాపీగా ఉన్నా. జనతా గ్యారేజ్‌తో నాకు పెద్ద హిట్‌ ఇచ్చిన కొరటాల శివతో తదుపరి చిత్రం చేస్తున్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తవగానే ఆ సినిమా మొదలు పెడతాం. ప్రస్తుతం స్ర్కిప్టు వర్క్‌ జరుగుతుంది. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుంది.

అలా టైటిల్ ఫిక్స్ చేశారు..

అసలు రాజమౌళి ఈ ఇంటర్వ్యూ చదివితే గొడ్డలి పట్టుకొని నా వెంట పడతాడు. ఇందులో ప్రతి యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ‘బాహుబలి’ లాంటి సినిమా అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో నేనూ, రామ్‌చరణ్‌ కలసి నటించటాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. దీనిని పాన్‌ ఇండియా చిత్రం అనే కంటే భారతీయ చిత్రం అనటం నాకు ఇష్టం. పాన్‌ అనప్పుడల్లా ఇంట్లో వంటపాత్ర గుర్తుకొస్తుంది నాకు. మొదట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే అంతా రాజమౌళి– రామారావు– రామ్‌చరణ్‌ అనుకున్నారు. అది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే! అయితే, ఆ పేరు బాగా జనాల్లోకి వెళ్లడంతో పేరుతోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’: ‘రౌద్రం, రణం, రుధిరం’ అని అర్థం వచ్చేలా రాజమౌళి టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో నేను చేసేది ఓ చారిత్రక యోధుడి పాత్ర. ఇలాంటి పాత్ర చేసేటప్పుడు ఒత్తిడి ఉండటం సహజం. ఈ పాత్రకు తగ్గట్టు మారటానికి 18 నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నా. ఈ సినిమా కోసం 9 కిలోల బరువు పెరిగాను. నిజమైన హీరోల గురించి దేశవ్యాప్తంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు రెండు పాత్రలు చాలా బలమైనవి. వాటిపై చాలా పరిశోధన చేసి యాక్ట్‌ చేశాం. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల కథను మా పిల్లలకి చెబుతున్నా.

Get Breaking News Alerts From IndiaGlitz