close
Choose your channels

నేను రాను బిడ్డో.. యములున్నా దవాఖానకు!

Tuesday, June 30, 2020 • తెలుగు Comments

‘దగ్గుతోటి.. దమ్ముతోటి.. చలి జ్వరమొచ్చిన అత్తో.. అత్తో పోదాం రావే.. సర్కారు దవాఖానకు..
నేను రాను బిడ్డో యములున్న దవాఖానకు’ అంటూ ‘నేటి భారతం’ను ఆనాడే కళ్లకు కట్టాడో కవి.
ఆ పాట అప్పటి పరిస్థితినేమో కానీ ఇప్పటి పరిస్థితిని మాత్రం కళ్లకు కడుతోంది.

ఇటీవల.. జర్నలిస్ట్ మనోజ్ మృతితో గాంధీ హాస్పిటల్‌లో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం వెలుగు చూసింది.

ఆ తరువాత.. ఓ వ్యక్తి తన భార్యను బతికించమని వేడుకుంటూ ప్రతి ఒక్క హాస్పిటల్ మెట్లూ ఎక్కి దిగినా సిబ్బంది దారుణంగా తీసిపడేయటం తప్ప.. కనీసం మనుషుల్లా కనికరం చూపలేదు. ఈ ఘటన జంట నగరాల్లోని ధర్మాసుపత్రుల్లో పరిస్థితిని కళ్లకు కట్టింది.

తాజాగా మరో ఘటన.. ఓ వ్యక్తి తను ఎంత వేడుకున్నా తనకు వెంటిలేటర్ పెట్టలేదని.. తాను చనిపోతున్నానంటూ తండ్రికి తుడి వీడ్కోలు చెప్పిన హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ఇవన్నీ సర్కారు దవాఖాన తీరును మరోసారి కళ్లముందుంచాయి.

ఇవి మనకు తెలిసినవి మాత్రమే.. మనకు తెలియని ఘటనలు కోకొల్లలు.. శవాలను మార్చివేసిన ఘటనలు.. వైద్యం కోసం వెళ్లిన వ్యక్తి ఆచూకీ దొరక్కుండా చేయగా.. చివరకు పోలీసుల విచారణలో డెడ్‌బాడీ మార్చురీలో దొరికింది. ఇలా వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో.. ఎన్నెన్నో..

సందట్లో సడేమియాగా ప్రైవేటు ఆసుపత్రులు దండుకోవడం ప్రారంభించాయి. ఇటీవల కరోనాతో బాధపడిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ ఇచ్చి రూ.3 లక్షలకు పైనే బిల్లు వసూలు చేశాయి. ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా బెడ్లు కరువు. మరింత ఆసక్తికర విషయం ఏంటంటే.. కొందరు డబ్బున్న మారాజులు బెడ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారని సమాచారం. ఇది కూడా పక్కనబెడితే ప్రైవేటు పాఠశాలలు అందిస్తున్న ఆన్‌లైన్ క్లాసుల్లా.. ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్. ఫ్రీగా మాత్రం కాదు. ఒకవేళ కరోనా వస్తే.. మనింట్లో మనం కూర్చొని ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సలహాలు.. అవసరమైన పరికరాలు మాత్రం అందజేస్తారు. దీనికి ప్రైవేటు ఆసుపత్రులు దాదాపు రూ.20 వేలు ఫీజు వసూలు చేస్తున్నాయి.

పూలు చల్లించుకున్న చేతులతోనే వైద్యులు రాళ్లేయించుకుంటున్న పరిస్థితి.. దేవతలని కీర్తించిన నోళ్లతోనే దెయ్యాలని పిలిపించుకుంటున్న పరిస్థితి ఎందుకొచ్చింది? ఒకప్పుడు రోజు విడిచి రోజు మీడియా ముందుకొచ్చి ప్రజలకు ఎంతో ధైర్యాన్నిచ్చిన సీఎం కేసీఆర్ ఈ మధ్యకాలంలో కరోనా విషయమై మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడేడి? మొత్తంగా చూస్తే ఒక వేలు వైద్యుల వైపు.. మిగిలిన నాలుగు వేళ్లూ సర్కారు వైపే చూపిస్తున్నాయి. వేలల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కానీ వైద్యుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఇంతమందికి ట్రీట్‌మెంట్ చేసేందుకు సరైన ఎక్విప్‌మెంట్ కూడా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. పరిస్థితి మరింత దిగజారక ముందే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz