close
Choose your channels

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

Friday, January 22, 2021 • తెలుగు Comments

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని.... మరో రెండు మూడు సమావేశాల అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గురువారం రాత్రి తిరుపతిలో జరిగిన చిత్తూరు జిల్లా జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం చేశారు. టిక్కెట్టు ఏ పార్టీకి దక్కినా జనసేన-బీజేపీ కూటమి బలపడాలనే ధ్యేయంతో అందరూ పని చేయాలని పవన్ సూచించారు. పవన్ తమ కార్యకర్తలకు చేసిన దిశా నిర్దేశం ఆయన మాటల్లోనే...

తాగుబోతుల పని అని...

చిన్నచిన్న సమస్యలు తలెత్తినా సరిదిద్దుకొని ముందుకెళదామన్నారు. తిరుపతి వచ్చినప్పటి నుంచి కలిసిన వారంతా తిరుపతి మనకు బలమైన స్థానం... మనమే పోటీ చేయాలంటున్నారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం విషయంలో వైసీపీలోని కొందరు హిందూ నాయకుల వల్లే ఇంత నష్టం జరిగింది. ఇది తాగుబోతుల పని అని, జంతువులు కూలదోశాయని ఇలా అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు చేయడం దారుణం. రాములవారి విగ్రహం తల నరకడాన్ని ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఖండిస్తారు. అంతర్వేదిలో రథం దగ్ధం సంఘటన అనంతరం దీపాలు వెలిగించమని నేను పిలుపునిస్తే కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆచరించారు. సెక్యులరిజం అంటే అదే. మసీదులు, చర్చిలపై దాడులను ఖండించి ఆలయాల విధ్వంసాన్ని ప్రశ్నించకపోవడం ఏమి సెక్యులరిజం? ఇది నాయకుల సమస్య. ప్రజల సమస్య కాదు.

అండగా ఉన్నామని చెప్పడానికే అక్కడకు వెళుతున్నా....

కలసి పని చేస్తే కార్యకర్తలకు ఇబ్బందులు తప్పుతాయి. ప్రకాశం జిల్లాలో శ్రీ బండ్ల వెంగయ్య నాయుడును ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు దుర్భాషలాడటం, వైసీపీ శ్రేణులు మానసికంగా హింసించడం లాంటి సంఘటన అక్కడ మన వాళ్లు 40, 50 మంది ఉండి ఉంటే జరిగేదా? ఆత్మహత్య చేసుకున్న శ్రీ వెంగయ్య కుటుంబానికి అండగా మేము ఉన్నామని చెప్పడానికే రేపు అక్కడకు వెళుతున్నాను. అవతలి వాళ్లు రౌడీలైనా, గూండాలైనా భయపడను. అకారణంగా మనకు ఎవరితో గొడవలొద్దు అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉపదేశించారు. సమావేశం ప్రారంభం కాగానే శ్రీ వెంగయ్య ఆత్మకు శాంతి చేకూరాలంటూ అందరూ లేచి నిలబడి కాసేపు మౌనం పాటించారు.

ఒట్టి గొడ్డుకు అరుపెలెక్కువ..

ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువంటారు. దానిని దృష్టిలో ఉంచుకొని వాటిని మీరు పట్టించుకోవద్దు. ప్రజాసమస్యల పరిష్కార ప్రయత్నాల నుంచి మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి అరుస్తూ ఉంటారు. అప్రమత్తంగా ఉండాలి. అన్ని గ్రామాలు తిరగాలి. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలి. ఉపాధి, నిరుద్యోగం, వ్యవసాయం లాంటి అంశాలపై అధ్యయనం చేయాలి. మథనం జరగాలి. మన ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలి. అధికారం అనే భావజాలం తప్ప చాలా పార్టీలకు వేరే భావజాలం లేదు. కాని మనం అలా కాదు. మనకు సైద్ధాంతిక బలమే పునాది. దానిని ఇష్టపడే ఇంత మంది యువత మన వెంట ఉన్నారు. ఇక మనం పోరాటం చేసుకుంటూ పోతే ఇతర వనరులన్నీ వాటికవే సమకూరుతాయి. పని చేసుకుంటూ పోతే పదవులే మన వెంట వస్తాయి. వాటి కోసం వెంట పడాల్సిన అవసరం లేదు. మనం అధికారంలో ఉన్నా లేకున్నా మన భావజాలం మారదు. జనసేన పార్టీ ఎప్పుడూ ఉద్వేగపూరిత రాజకీయాలు చేయదు. అందుకనే దివీస్ కు వ్యతిరేకంగా చేసినంత ఉద్యమాన్ని రామతీర్థం వ్యవహారంలో చేయలేదు. సున్నితమైన అంశమైనందునే ఇలా చేయాల్సి వచ్చింది. మానవత్వం కోసం రాజకీయ లబ్దిని వదులుకోవడానికైనా సిద్ధమే.

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

క్రియాశీలక సభ్యత్వం కీలకం

పార్టీ క్రియాశీల సభ్యత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది చాలా కీలకమైనది. క్రియాశీలక సభ్యులే భవిష్యత్తు నేతలు. వారిని సక్రమంగా గుర్తించి అందరినీ సమానంగా చూడాలి. గంగిగోవు పాలు గరిటడైనా చాలు అనేది గుర్తుపెట్టుకోవాలి.

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి: నాదెండ్ల మనోహర్

హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి. అప్పట్లో నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు జరిపిన దౌర్జన్యం చేశాయి. వీటన్నంటినీ గమనంలో ఉంచుకొని కలసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవాలి. కరోనా సమయంలో జనసేన శ్రేణుల సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. నివర్ తుపాను బాధిత రైతులకు అండగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపును విజయవంతం చేయాలి. గత సంవత్సరం పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా 84 కార్యక్రమాలు నిర్వహించాం. అధ్యక్షుల వారు ఎంతో సమయం కేటాయించారు. యువత, జనసైనికులతో నాయకులు ప్రేమగా వ్యవహరించాలి. అందరినీ కలుపుకుంటూ టీం స్పిరట్‌తో పనిచేయాలి.

Get Breaking News Alerts From IndiaGlitz