close
Choose your channels

ఢిల్లీలో పవన్ ‘పొత్తు’ బిజీ.. బాంబ్ పేల్చిన కీలకనేత!

Monday, January 13, 2020 • తెలుగు Comments

ఢిల్లీలో పవన్ ‘పొత్తు’ బిజీ.. బాంబ్ పేల్చిన కీలకనేత!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీకి ఫిక్స్ అయ్యారా..? రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కలిసి పోటీ చేస్తారా..? అందుకే నిన్న ఆర్ఎస్ఎస్.. ఇవాళ బీజేపీ నేతలతో వరుస భేటీ అయ్యారా..? అంటే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే పరిస్థితులే మెండుగా కనిపిస్తున్నాయి.

కలిసి ముందుకెళ్లాలని భావించి..!
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జనసేన.. అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. జనసేన తరఫున పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా ఘోరంగా పరాజయం పాలయ్యారు. మరోవైపు ఈ పార్టీ నుంచి వన్ అండ్ ఓన్లీ రాపాక వరప్రసాద్ మాత్రమే గెలుపొందారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రెండు చోట్ల పోటీ చేసి కూడా ఇలా ఓడిన సందర్భాలు దాదాపు లేనేలేవు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఏ ఎన్నికలను కూడా ఎదుర్కొలేదు. ఏపీ ఎన్నికల తర్వాత తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇక సింగిల్‌గా పోటీ చేయకూడదని ఎవరితోనైనా కలిసి ముందుకెళ్లాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది.

రెండ్రోజులుగా మకాం!
ఈ క్రమంలో ఇటీవలే మంగళగిరిలో పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన పవన్.. టీడీపీ, బీజేపీలతో విడిపోయి తప్పుచేశాననని అందుకే వైసీపీ గెలిచిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉన్నట్లు పరోక్షంగా పవన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన మనసులోని మాటను తెలుసుకున్న ఢిల్లీ కమలనాథులు కబురు పంపడం.. మీటింగ్‌లో ఉండగానే హుటాహుటిన పవన్ ఢిల్లీ పయనమయ్యారు. ఈ క్రమంలో రెండ్రోజులగా ఢిల్లీలోనే పవన్ మకాం వేశారు.

తాజా పరిణామాలపై చర్చ!
మొదటి రోజు పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో పవన్ చర్చించడం.. రెండోరోజు పర్యటనలో భాగంగా కమలనాథులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. కేంద్ర మంత్రి, బీజేపీలో నంబర్-02గా ఉన్న అమిత్ షాతో భేటీ కావాలని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ అవ్వలేదు. ఈ క్రమంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. భేటీలో భాగంగా ఏపీ రాజధాని అమరావతిలో నెలకొన్న పరిణామాలు, మూడు రాజధానుల ప్రతిపాదనలతో తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించారు.

విలీనం కాదు.. పొత్తే!
అనంతరం బీజేపీ-జనసేన పొత్తుగా కీలకంగా చర్చించారట. అంతేకాదు.. విలీనం చేయాలని బీజేపీ కోరగా పవన్ మాత్రం అందుకు ససేమీరా అన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే కలిసి పోటీ చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని సమాచారం.

మౌనం వెనుక..!
ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటనలో అసలేం జరుగుతోంది.. అనే విషయాలను మాత్రం వెల్లడించేందుకు పవన్ వెంటే ఉన్న కీలక నేత నాదెండ్ల మనోహర్ గానీ.. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు మౌనంగానే ఉన్నారే గానీ విషయాలు చెప్పడానికి సాహసించలేదు. అయితే.. టైమ్ వచ్చినప్పుడు ఆ విషయాలు తెలియజేస్తామని మనోహర్ అనడం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి అధికారికంగా ఈ పొత్తు విషయమై ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.

బాంబ్ పేల్చిన టీడీపీ కీలకనేత..!
‘వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి పోటీ‌ చేస్తారు. చంద్రబాబు హయాంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. మోదీని విబేధించకుంటే బాగుండేది’ అని టీడీపీ కీలకనేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. కాగా పవన్ ఢిల్లీ పర్యటనలో ఉండగా రాయపాటి ఈ వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz