close
Choose your channels

Padi Padi Leche Manasu Review

Review by IndiaGlitz [ Friday, December 21, 2018 • తెలుగు ]
Padi Padi Leche Manasu Review
Banner:
Sri Lakshmi Venkateshwara Cinemas
Cast:
Sharwanand, Sai Pallavi, Murali Sharma, Priya Raman, Vennela Kishore, Kalyani Natarajan
Direction:
Hanu Raghavapudi
Production:
Chandra Sekhar Ravipati
Music:
Vishal Chandra Shekar

శ‌ర్వానంద్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా, సాయిప‌ల్ల‌వి డాక్ట‌ర్‌గా న‌టించిన సినిమా `ప‌డిప‌డి లేచె మ‌న‌సు`. ఈ చిత్రానికి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. అటు ద‌ర్శ‌కుడు, ఇటు న‌టీన‌టులు ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కోసం ఎదురుచూస్త‌న్న త‌రుణ‌మిది. ప్రేమ‌క‌థా చిత్రాల‌ను చ‌క్క‌గా డీల్ చేయ‌గ‌ల‌డ‌నే పేరున్న హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను అంతే బాగా డీల్ చేశారా? ఇందులో నాయికానాయ‌కుల‌కు మ‌ధ్య వ‌చ్చిన కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం.

క‌థ‌:

సూర్య రావిపాటి (శ‌ర్వానంద్‌)కి మెడికో వైశాలి (సాయిప‌ల్ల‌వి) అంటే ఇష్టం. త‌ను ఆమెను రెండేళ్లుగా ప్రేమిస్తుంటాడు. అయితే  ఆమెను ప్రేమిస్తున్న మ‌రో అజ్ఞాత ప్రేమికుడు త‌న‌ను కొడ‌తాన‌ని బెదిరిస్తున్నాడ‌ని ఆమెతోనే వెళ్లి చెబుతాడు. సూర్య ద్వారా అజ్ఞాత ప్రేమికుడి గురించి తెలుసుకున్న వైశాలికి అత‌న్ని చూడాల‌నే కుతూహ‌లం పెరుగుతుంది. మ‌న‌సులో అత‌ని గురించి క‌ల‌లు క‌న‌డం మొద‌లుపెడుతుంది. అత‌ని గురించి తెలుసుకోవ‌డానికి సూర్య‌తోనూ స‌న్నిహితంగా ఉంటుంది. ఓ సంద‌ర్భంలో సూర్య‌, అత‌నూ ఒక‌టేన‌ని ఆమెకు అర్థ‌మ‌వుతుంది. దాంతో ఇద్ద‌రి ప్రేమా సుఖాంత‌మ‌వుతుంది. కానీ అది పెళ్లికి దారి తీసే స‌మ‌యంలో అస‌లు ఇబ్బంది ఎదుర‌వుతుంది. త‌న తండ్రి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల చిన్న‌త‌నంలో గాయ‌ప‌డ్డ సూర్య హృద‌యం వైశాలిని పెళ్లి చేసుకోవ‌డానికి నిరాక‌రిస్తుంది. లివింగ్ టుగెద‌ర్ గురించి డిస్క‌ష‌న్ జ‌రుగుతుంది. `క‌లిసి ఉండాల‌ని పెళ్లి చేసుకోకూడ‌దు. విడిపోయి బ‌త‌క‌లేమ‌నుకున్న‌ప్పుడు పెళ్లి చేసుకోవాలి` అని నిర్ణ‌యానికి వ‌స్తారు. ఏడాది త‌ర్వాత వారు విడిపోయే అదే నేపాల్‌లో క‌లుసుకోవాల‌నుకుంటారు. ఆ రోజు ఇద్ద‌రూ వ‌చ్చారా?  రాలేదా?  వ‌స్తే ఏమైంది?  వైశాలికి లాస్ ఆఫ్ మెమ‌రీ ఎందుకు వ‌చ్చింది? ఆ విష‌యాన్ని సూర్య ఎలా చూశాడు?  అత‌ని ప్రేమ పెరిగిందా?  త‌గ్గిందా? ఆమెను జీవితంలోకి ఆహ్వానించాడా?  త‌న వారంద‌రి ద‌గ్గ‌రా వైశాలి దాచిన నిజం ఏంటి?  డాక్ట‌ర్ అజ‌య్ మంచి వాడా?  చెడ్డ‌వాడా?  అత‌ను వైశాలికి సాయం చేశాడా?  లేకుంటే ఆమె బ‌ల‌హీన‌త‌తో ఆడుకున్నాడా?  ఇంత‌కీ వైశాలికి ఉన్న లోపం ఏంటి?  వంటివ‌న్నీ సెకండాఫ్ చూసి తెలుసుకోవాలి.

ప్ల‌స్ పాయింట్లు:

శ‌ర్వానంద్‌కి త‌గ్గ పోటీ సాయిప‌ల్ల‌వి. ఎవ‌రికి వారు త‌మ త‌మ స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించారు. మ‌న‌సులో ప్రేమ‌ను ఉంచుకుని, పైకి ప్రియుడి ముందు లేన‌ట్టు న‌టించే సంద‌ర్భాల్లో సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు ఫిదా కావాల్సిందే. త‌న కోసం ప్రేయ‌సి రాక‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, ఆమె సుఖంగా ఉండ‌ట‌మే చాల‌నుకున్న ప్రియుడి పాత్ర‌లో శ‌ర్వానంద్‌కూ మార్కులు ప‌డ‌తాయి. వేరియ‌స్ ఎమోష‌న్స్ ని ఒకేసారి తెర‌మీద ఇద్ద‌రూ చ‌క్క‌గా ప‌లికించారు. కూతురును స‌పోర్ట్ చేసే తండ్రిగా ముర‌ళీ శ‌ర్మ‌, కెరీర్ కావాల‌నుకునే వ్య‌క్తిగా సంప‌త్‌రాజ్‌, అత‌ని దూరాన్ని భరించ‌లేని భార్య‌గా విమ‌లా.. ఎవ‌రికి వారు చ‌క్క‌గా న‌టించారు. సంగీతం బావుంది. ప‌డిప‌డి లేచే మ‌న‌సు టైటిల్ సాంగ్ మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా ఉంది. లొకేష‌న్లు, కోల్‌క‌తా, ఖాట్మండు అట్మాస్పియ‌ర్ తెలుగు తెర‌కు కొత్త‌గా అనిపించాయి. లొకేష‌న్ల‌ను కొత్త‌గా చూపిస్తాడ‌నే పేరును హ‌ను రాఘ‌వ‌పూడి మ‌రోసారి సార్థ‌కం చేసుకున్నారు. కెమెరా ప‌నిత‌నం కూడా బాగా ఉంది.

మైన‌స్ పాయింట్లు:

క‌థ కొత్త‌ది కాదు. కాక‌పోతే నేప‌థ్యం కొత్త‌ది. క‌థ పాత‌దే అయినా భావోద్వేగాలు స‌రిగా పండ‌లేదు. తొలిస‌గం మీద పెట్టిన దృష్టి, ద‌ర్శ‌కుడు రెండో స‌గం మీద కూడా పెట్టాల్సింది. చూపించిన స‌న్నివేశాల‌నే చూపించి, వాటి ద్వారానే ఏదో ఫ‌న్ క్రియేట్ చేయాల‌నుకునే ఫెయిల్ అయిన‌ట్టు అనిపిస్తుంది. ట్రైన్ సీన్‌, ఫ‌స్ట్ లో రాజు సుంద‌రం వ‌చ్చే సన్నివేశాలు, హీరోయిన్ రోడ్డు మీద గ్యాంగ్‌తో నాట‌కాలు వేసే సంద‌ర్భాలు.. ఇలా చాలా విష‌యాలు అన‌వ‌స‌రంగా నిడివిని పెంచుతున్నాయేమోన‌నిపిస్తుంది.

విశ్లేష‌ణ‌:

ఇద్ద‌రి మ‌ధ్య ఒరిజిన‌ల్ ప్రేమ ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ విడిచిపెట్టి పోదు అనే కాన్సెప్ట్ చెప్పాల‌నుకున్న ద‌ర్శ‌కుడు దాన్నే బ‌లంగా చెప్పి ఉంటే బావుండేది. దాని చుట్టూ, దానికి ఊత‌మిచ్చే స‌న్నివేశాల‌ను రాసుకుని ఉంటే ఇంకా మెప్పించగ‌లిగి ఉండేవారు. తొలి స‌గంలోనే నిడివి ఎక్కువైంద‌ని ఇంట‌ర్వెల్‌లో బ‌య‌టికి వ‌చ్చిన ప్రేక్ష‌కుడు ఇంటర్వెల్ త‌ర్వాత రిపీటెడ్ స‌న్నివేశాల‌ను చూసి విసిగిపోతాడు. సునీల్  హీరోయిన్‌కి బావ‌గా, ఎన్నారైగా క‌నిపించినా, పెద్ద‌గా న‌వ్వులు పండించ‌లేదు. కాక‌పోతే సునీల్‌, వెన్నెల కిశోర్ కాంబినేష‌న్‌లో సీన్ కాస్త ఊర‌డింపు. భావోద్వేగాల‌ను పండించ‌గ‌లిగిన న‌టులు ఉన్న‌ప్ప‌టికీ, క‌థా బ‌లం లేక‌పోవ‌డంతో స‌న్నివేశాలు కొన్నిచోట్ల తేలిపోయాయి. ఎడిటింగ్ మీద కూడా ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బావుండేది. డైలాగులు అక్క‌డ‌క్క‌డా బావున్నాయి. భూకంపం స‌న్నివేశాలు ఫ‌ర్వాలేద‌నిపించేలా ఉన్నాయి. `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` అంద‌రికీ క‌నెక్ట్ అవుతుందా?  అన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. స మాధానం కోసం వేచి చూడాల్సిందే.

బాట‌మ్ లైన్‌:  కాస్త నిదానంగా 'ప‌డి ప‌డి లేచే మ‌న‌సు'

Read 'Padi Padi Leche Manasu' Review in English

Rating: 2.75 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE