close
Choose your channels

బిగ్‌బాస్ విన్నర్‌పై వస్తున్న పుకార్ల పట్ల నాగ్ క్లారిటీ

Sunday, November 3, 2019 • తెలుగు Comments

బిగ్‌బాస్ విన్నర్‌పై వస్తున్న పుకార్ల పట్ల నాగ్ క్లారిటీ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్‌ లాస్ట్ డే నేడే. ఇవాళ విన్నర్ ఎవరో..? రన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడక మునుపే ఇదిగో విన్నర్.. అదుగో రన్నర్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా బిగ్‌బాస్-3 విన్నర్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తమ కంటెస్టెంటే విన్నర్ అని రాహుల్ వీరాభిమానులు.. మరోవైపు అబ్బే మా శ్రీముఖినే విన్నర్ అని ఆమె వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు శ్రీముఖి విన్నర్ అన్నట్లు.. టైటిల్ గెలుచుకున్న అనంతరం వ్యాఖ్యాత నాగ్‌ను హగ్‌ చేసుకుంటున్నట్లు ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. అయితే ఈ పుకార్లతో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియక బిగ్‌బాస్ ప్రియులు, కంటెస్టెంట్ల వీరాభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఈ పుకార్లపై స్పందించి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

వదంతులు నమ్మకండి.. లైవ్‌లో చూడండి!

‘అసలు ఇంకా ఫైనల్ షూటింగ్ పూర్తి కాలేదు. ఈ రోజు సాయంత్రం లైవ్‌ ప్రసారం జరుగుతుంది. బిగ్‌బాస్-3 చివరి రోజు షూటింగ్ జరుగబోతోంది. నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. ఫైనల్ ఎపిసోడ్ లైవ్‌లో ప్రసారం కాబోతోంది. సోషల్ మీడియాలో విజేత గురించి వస్తున్న వార్తలను నమ్మకండి. సాయంత్రం జరిగే లైవ్ కార్యక్రమంలో విజేత ఎవరనేది తెలుసుకోండి’ అని ప్రేక్షకులు, ఔత్సాహికులకు నాగ్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. మరి విన్నర్ ఎవరో.. రన్నర్ ఎవరో అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Get Breaking News Alerts From IndiaGlitz