close
Choose your channels

Mudragada and Jogaiah:పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ, జోగయ్య.. మీకో దండం అంటూ లేఖలు..

Thursday, February 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తాడేపల్లిగూడెం సభలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. తనకు సలహాలు, సూచనలు ఎవరూ ఇవ్వొద్దని గట్టిగానే చెప్పారు. దీంతో ఇప్పటివరకు పవన్‌కు సలహాలు ఇస్తున్న కాపు సీనియర్ నేతలు హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ లేఖలు రాశారు.

అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి పవన్‌తో కలిసి సేవ చేయాలనుకున్నట్లు భావించానని చెబుతూ ముద్రగడ పవన్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

'మిత్రులు పవన్ కళ్యాణ్ గారు.. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్లొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నాను. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్‌ జాతి చాలా బలంగా కోరుకున్నారు, వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి, కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు' లేఖలో పేర్కొన్నారు.

'గౌరవ చంద్రబాబునాయుడు గారు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదండి, చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్ములను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడానండి. పవర్‌ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి, ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదండి. భగవంతుడ్ని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి' అన్నారు.

'కాని మీలాగా గ్లామర్‌ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్‌ గ్రేడ్‌ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీచేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి.. ఆల్ ది బెస్ట్ అండి' అంటూ లేఖను ముగించారు.

ఇక హరిరామ జోగయ్య అయితే టీడీపీ-జనసేన బాగు కోరి తాను ఇచ్చిన సలహాలు చంద్రబాబు, పవన్‌కు నచ్చినట్లు లేదంటూ లేఖ రాశారు. తన సలహాలు నచ్చకపోవడం వాళ్ల ఖర్మ అని.. ఇక తాను చేసేదేమీ లేదని స్పష్టంచేశారు.

కాగా పొత్తులో భాగంగా పవన్‌ కనీసం రెండున్నరేళ్లు సీఎం కావాలని జనసైనికులు కోరుకుంటున్నారని కూడా జోగయ్య తన లేఖల్లో ప్రస్తావించేవారు. అలాగే కేవలం 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకోవడాన్ని కూడా విమర్శించారు. అలాగే ముద్రగడ కూడా పవన్‌పై కొన్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారి పేరు ఎత్తకుండానే తాడేపల్లిగూడెం సభలో పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జోగయ్య, ముద్రగడ స్పందించండం ప్రాధాన్యత సంతరించకుంది. ఇక వారి నుంచి బహిరంగ లేఖలకు ముగింపు పడినట్లేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.