Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ కుంభమేళాగా పేరు గడించిన మేడారం మహా జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లు మేడారం వైపే కదిలాయి. దీంతో దారులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు సాగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ప్రారంభానికి వారం పది రోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి నాలుగు రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు మంజూరు చేశారు. ఇవాళ ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు.
ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులు, పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పగిడిద్దరాజును పడగ రూపంలో పట్టుకొని మేడారానికి బయల్దేరారు. మహబూబాబాద్ నుంచి 70 కిలోమీటర్ల పయనం తర్వాత ఈ సాయంత్రానికి జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. అక్కడ కొక్కెర వంశీయులు వారికి స్వాగతం పలుకుతారు. పగిడిద్దరాజుకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రతిగా సమ్మక్కకు పెనుక వంశీయులు చీర, పసుపు, కుంకుమ పెడతారు. రాత్రి 9 గంటలకు పగిడిద్దరాజు సారలమ్మ, గోవిందరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరుతారు.
రెండో రోజు గురువారం సమీపంలోని చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తిచేశాక, ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోనుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనం నుంచి మొదలుకొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్టించడం, వనదేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఈ జాతరను చూసి మొక్కులు చెల్లించుకునేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు.
ఇదిలా ఉంటే మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. "గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం" అని తెలిపారు. ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి మేడారం వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments