close
Choose your channels

టీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేసిన మావోలు.. హత్యలు మొదలు!!

Saturday, July 13, 2019 • తెలుగు Comments

టీఆర్ఎస్‌ను మావోయిస్టులు టార్గెట్ చేశారా..? టీఆర్ఎస్ పాలన పట్ల మావోలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..? మాది మావోల భావాజలం.. వారి అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారా..? అంటే తాజాగా మావోల కిరాతకాన్ని అక్షరాలా నిజమనిపిస్తోంది.

కిడ్నాప్ చేసి మరీ..!
తెలుగు రాష్ట్రాల్లో మావోలు కనుచూపు మేరలో కనిపించలేదన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తూ ఏదో దుశ్చర్యకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలోని విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో.. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండలో ఈ మధ్య నేతలను హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. కాగా.. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతూరు ఎంపీటీసీ శ్రీనివాసరావును మావోయిస్టులు జులై 8న రాత్రి అపహరించిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య, కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కర్రలతో ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు. కాగా.. ఆగస్టు 5తో పదవీ కాలం ముగియనుంది.

దారుణంగా హత్య..!
భద్రాద్రి జిల్లాలోని చింతూరు ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ నేత శ్రీనివాసరావును పలుమార్లు హెచ్చరించిన మావోలు.. శుక్రవారం నాడు ఏకంగా అత్యంత దారుణంగా హత్య చేశారు. గొడ్డళ్లతో నరికి చంపిన మావోలు ఎర్రంపాడు - పుట్టపాడు మార్గంలో శుక్రవారం (జులై 12) సాయంత్రం ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో రక్తపు మడుగులో భయానక స్థితిలో శ్రీనివాసరావు మృతదేహం పడిఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌ఫార్మర్‌గా మారి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే హతమార్చామని మావోలు పేర్కొన్నారు. చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో ఓ లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఈ హత్యకు ముందు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అడ్డగించుకుని మావోల కాళ్లావేళ్లా పడినా వాళ్లు ఏ మాత్రం జాలి, దయ చూపలేదట.

కాగా.. ఈ హత్యలో 15 మంది వరకు మిలీషియా సభ్యులు కర్రలు, గొడ్డళ్లతో వచ్చినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వివరించారు. కాగా ఈ దారుణ హత్యతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలు ఎలా రియాక్ట్ అవుతారో మరి. మొత్తానికి చూస్తే ఈ ఘటనతో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. మున్ముంధు మావోలు ఇంకెంతమందిని టార్గెట్ చేస్తారో..? ఏంటో..?.. ఈ హత్యతోనే టీఆర్ఎస్ నేతల టార్గెట్ మొదలైందని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz