close
Choose your channels

Chiranjeevi:పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సందేశం..

Tuesday, May 7, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలింగ్‌కు ఐదు రోజులు ముందు ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. తన తమ్ముడు బలవంతంగా సినిమాల్లోకి వచ్చాడని, కానీ ఇష్టంగా రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఈ వీడియోలో కోరారు.

"కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్... తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం... ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.

సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.

ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే... పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి. సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించండి. జైహింద్" అంటూ చిరంజీవి ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు.

మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనానికి మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కల్యాణ్‌కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అంటూ నాని ట్వీట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.