Lokesh:మంత్రులకు కౌంట్‌డౌన్ మొదలైంది.. పాదయాత్రలో లోకేశ్ హెచ్చరిక..
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. సుదీర్ఘ విరామం తర్వాత చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పున: ప్రారంభమైంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించారు. ఈ యాత్రలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తాటిపాక బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపితే పాదయాత్ర ఆగుతుంది అనుకున్నారని.. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని స్పష్టంచేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారని ఆరోపించారు. తనపై కూడా సీఐడీ ఇప్పటి వరకూ 6 కేసులు పెట్టినా ఒక్క ఆధారం చూపించలేదన్నారు.
ఇక రాష్ట్రంలో యుద్ధం మొదలైందని.. ఇంకో మూడు నెలల్లో సైకో జగన్‌ను పిచ్చాస్పత్రికి పంపిస్తానని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇచ్చిన ఈ గొంతును ఎవ్వరూ ఆపలేరన్నారు. యువగళం జరగనిస్తే పాదయాత్ర.. లేకపోతే దండయాత్ర అంటూ హెచ్చరించారు. చంద్రబాబుని చూస్తే చాలు జగన్ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ బస్సు యాత్ర కాస్త తుస్ యాత్ర అయిందని.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని పట్టించుకనే వారే లేరని సెటైర్లు వేశారు. కటింగ్ ఫిటింగ్ మాస్టర్ అయిన జగన్.. బల్లపైన బ్లూ బటన్, బల్ల కింద రెడ్ బటన్ నొక్కుతారని విమర్శించారు.
ఆనాడు పవన్ కల్యాణ్ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశామని.. తమపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి కక్కించి అందరిని జైల్లో పెడతామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు ఎక్కడికి పారిపోయినా వదిలే ప్రసక్తే లేదని లోకేశ్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments