close
Choose your channels

కోడెల-చంద్రబాబు ఫోన్ సంభాషణ.. బయటపెట్టిన మంత్రి!

Tuesday, September 17, 2019 • తెలుగు Comments

కోడెల-చంద్రబాబు ఫోన్ సంభాషణ.. బయటపెట్టిన మంత్రి!

టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణం ప్రభుత్వం వల్లేనని టీడీపీ.. మేం ఆయన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదని అధికార పార్టీ నేతలు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకొచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు-కోడెల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణను బయటపెట్టారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని.. బాధితులే కేసులు పెట్టారన్నారు. 40 మంది కేసులు పెడితే కోడెల ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, కేసులు పెడితే ఎవరైనా పోరాటం చేస్తారు కానీ నమ్మిన కుటుంబం మోసం చేస్తే.. పార్టీ అధినేత పక్కన పెడితేనే కోడెల సూసైడ్‌ చేసుకున్నారని ఆరోపించారు. కోడెలను అవమానించింది చంద్రబాబేనని కొడాలి తేల్చిచెప్పారు.

నిజమా కాదా..?

‘శివ ప్రసాద రావు మిమ్మల్ని కలవాలని గత 15 రోజులుగా ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం కాదా?. హైదరాబాద్‌లో కలుద్దామని ఆయనకు చెప్పి.. నేను బిజీగా ఉన్నా.. రేపు మాట్లాడదాం అని చెప్పింది నిజం కాదా?. నిన్న ఉదయం 9.30 గంటల దాకా మీతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించి.. కుదరకపోవడంతో.. ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుంది నిజం కాదా?’ అని బాబుపై నాని ప్రశ్నల వర్షం కురిపించారు.

కోడెల పులి.. బాబు నక్క!

‘కోడెల పులి అయితే.. చంద్రబాబు నక్క. బాబు కోడెలను మోసం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను కూడా ఇలాగే పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేసి పదవి నుంచి దింపేశారు. తర్వాత దండలేసి శవయాత్ర చేసింది కూడా బాబే. ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ వేయాలని హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఆయన చనిపోయాక శవం కంటే ఎక్కువ బాబే కనిపించారు. కోడెల బతికి ఉండగా.. వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది, అక్రమ కేసులు పెడుతోంది, అవమానిస్తోందని చంద్రబాబు ఒక్కరోజైనా మాట్లాడారా? పల్నాడులో వైసీపీ బాధితుల క్యాంప్‌కి కోడెల వస్తానంటే.. రావొద్దని ఎందుకన్నారు..?’ అని నాని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను కోరుతున్నా..!

‘కోడెలతో చేయించాల్సిన దురాగతాలన్నీ చేయించి పార్టీ నుంచి వదిలించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. కోడెల మీద ఏవైనా ఆరోపణలు వస్తే.. టీడీపీకి చెందిన ఒక్క నాయకుడు కూడా మీడియా ముందు మాట్లాడలేదు. పార్టీ నుంచి కోడెలను సస్పెండ్ చేయాలని ప్రయత్నించావ్. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే.. నీ నక్కజిత్తులు బయటపెడతాడని భయపడి.. ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పావ్. చంద్రబాబు కోసం కోడెల ఎన్నిసార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించారో చూడండని కేసీఆర్ సర్కారును కోరుతున్నా. కోడెల కేసులో చంద్రబాబు నాయుణ్ని కూడా విచారణ జరపాలి. ఆయన చావుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఈ కేసులో ఏ1 నిందితుడు బాబే’ అని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కాటి కాపరిలాగా!

‘కోడెల చనిపోవడానికి కారణం చంద్రబాబే. కోడెల సూసైడ్ నోట్‌లో తన మీద ఏమైనా రాశారోమోనని చంద్రబాబు భయపడ్డారు. అలాంటిదేమీ లేదని పోలీసులు తేల్చడంతో.. కాటి కాపరిలా శవరాజకీయాలు చేస్తున్నారు. కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదు. నమ్ముకున్న పార్టీ, కుటుంబ సభ్యులు అవసరం లేదని భావిస్తుండటంతో.. కోడెల ఆత్మహత్య చేసుకున్నారు’ అని కొడాలి నాని చెప్పడం గమనార్హం.

అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ టీడీపీ నేతలు.. ముఖ్యంగా చంద్రబాబు రియాక్ట్ కాకపోవడం గమనార్హం. అసలు నాని ఇలా ఎందుకు మాట్లాడారు..? ఆయన దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా..? లేకుంటే నోటి కొచ్చినట్లు మాట్లాడేశారా..? అనేది తెలియాల్సి ఉంది మరి.

Get Breaking News Alerts From IndiaGlitz