close
Choose your channels

యష్ పుట్టిన రోజున ‘కేజీయ‌ఫ్ చాప్టర్-2’ టీజ‌ర్‌

Tuesday, January 5, 2021 • తెలుగు Comments

‘కేజీఎఫ్’ సినిమాతో యావత్ దేశ వ్యాప్తంగా తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు హీరో రాక్‌స్టార్ యష్. జనవరి-08న యష్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘కేజీయ‌ఫ్ చాప్టర్-2’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సరిగ్గా జ‌న‌వ‌రి-08న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు టీజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో ఆశలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి సినిమా వస్తుందా అభిమానులు, ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. దానికంటే ముందుగా ఫ్యాన్స్‌కు టీజర్ రూపంలో చిన్నపాటి ట్రీట్ ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమయ్యింది. ఒక్క యష్ అభిమానులే కాకుండా ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఆశ్చర్యమేమిటంటే పెద్ద పెద్ద హీరోలు, దర్శకనిర్మాతలు సైతం ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ప్యాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న హోంబాలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ టీజర్‌కు సంబంధించి ముందుగా కర్టన్ రైజర్‌ను ప్రకటన రూపంలో వెల్లడించారు. ఈ సందర్భంగా హోంబాలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకాభిమానులకు కొత్త ఏడాది 2021లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలను తెలియజేశారు. ‘ఇప్పటి వరకు మాతో కలిసి ప్రయాణం చేసిన అభిమానులు.. వారు అందించిన మధుర జ్ఞాపకాలను మరచిపోలేం. కేజీయఫ్‌ చాప్టర్‌-01 ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకాభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ ఏడాదిలో కేజీయఫ్‌ చాప్టర్‌-2 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇదే సందర్భంలో యష్ పుట్టినరోజు జనవరి 8న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు కేజీయఫ్‌ చాప్టర్-2 ఫస్ట్‌ విజువల్‌ను మా హోంబాలే ఫిలింస్‌ యూ ట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు ఇలాగే మాపై ఉంటాయని ఆశిస్తున్నాం’ అని కిరగందూర్‌ ప్రకటన రూపంలో తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz