close
Choose your channels

‘సాగర్’పై కేసీఆర్ వ్యూహం.. కోమటి రెడ్డి సవాల్..

Monday, January 18, 2021 • తెలుగు Comments

‘సాగర్’పై కేసీఆర్ వ్యూహం.. కోమటి రెడ్డి సవాల్..

త్వరలోనే నాగార్జున సాగర్‌తో పాటు.. తిరుపతి ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు తిరుపతిలోనూ.. ఇటు సాగర్‌లోనూ రాజకీయం బాగా వేడెక్కుతోంది. సాగర్‌లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీకి జానారెడ్డి ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం. ఇక టీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. బీజేపీ తరుఫున మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తే మరోసారి పోటీ చేయనున్నట్టు సమాచారం. దుబ్బాక ఎన్నికల్లో కానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కానీ సాగర్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే. ఇక్కడ బీజేపీ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ పోరు మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే కనిపిస్తోంది.

అటు జానారెడ్డి.. ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇద్దరూ సీనియర్ నేతలే కావడం గమనార్హం. జానారెడ్డి 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పలుమార్లు మంత్రిగా కూడా పని చేశారు. స్వభావ రీత్యా కూడా సౌమ్యుడు.. చాలా మంచి వ్యక్తి కావడంతో ఆయనకు ప్రజల నుంచి మద్దతు బాగానే లభించనుంది. ఇప్పటికే జానారెడ్డి తన విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు కూడా గెలుపు ధీమాను స్పష్టం చేసేవిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాల గురించి మాట్లాడబోనని సవాల్ చేశారు. సాగర్‌లో జానారెడ్డి గెలుపు ఖాయమని వెల్లడించారు. ఐకేపీ సెంటర్లు బంద్ పెడితే టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వ తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ రాజీపడ్డా తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. యాదగిరిగుట్టలో షాపులు, ఇళ్లు కోల్పోయిన పేద వారికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో ఎన్నికలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. మూడేళ్ళుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేక 4 వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. రాజ్ భవన్ ముట్టడికి పోలీసులు అడ్డుపడ్డా ముట్టడించి తీరుతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం.. కేసీఆర్‌కు కలలో కూడా ఊహించని దెబ్బే తగులుతుంది.

ఇటు టీఆర్ఎస్ పార్టీకి సైతం ఈ గెలుపు అత్యవసరమే. ఇక్కడ కానీ ఓడిపోతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై భారీగా పడిపోతుంది. అంతేకాదు.. తమ పార్టీ పతనాన్ని చూసి ఇక పార్టీలోనే ఉంటే కష్టమనే భావనకు ఆ పార్టీ నేతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తమ నేతల్లో విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే కూడా సాగర్‌లో గెలవడం టీఆర్ఎస్‌కు తప్పనిసరి ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తోంది కాంగ్రెస్ దిగ్గజ నేత జానారెడ్డి. ఆయనను తేలికగా తీసుకోవడానికి లేదు. యథావిధిగానే టీఆర్ఎస్ ఈ ఉపఎన్నికలో కూడా తెలంగాణ సెంటిమెంట్‌నే ఆయుధంగా చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సారి సాగర్‌లో గెలుపు బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా స్వయంగా కేసీఆరే రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. సాగర్ జలాలను దొంగచాటుగా ఏపీకి తరలించడాన్ని నిరసిస్తూ 2003లో కేసీఆర్‌ కోదాడ నుంచి హాలియా వరకు కేసీఆర్‌ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర అంశాన్ని కేసీఆర్ తిరిగి తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి సాగర్ పోరు.. బీభత్సంగానే ఉండబోతోందని తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz