close
Choose your channels

అసెంబ్లీ వేదికగా లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

Friday, March 26, 2021 • తెలుగు Comments

అసెంబ్లీ వేదికగా లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణలో లాక్‌డౌన్‌పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మరోసారి విజృంభిస్తుండటంతో దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. త్వరలో లాక్‌డౌన్ విధిస్తారని.. కర్ఫ్యూ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ మూసివేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టైంది. దీనిపై నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని... రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టబోమని తేల్చి చెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్లు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని... ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా గతేడాది తీవ్రంగా నష్టపోయామన్నారు.

కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయ్యిందని... పరిశ్రమల మూతవేత ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. తక్కువ మంది అతిథుల మధ్యే శుభకార్యాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ డోసుల్లో మనవాటా మనకు వస్తుందని తెలిపారు. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా టెస్ట్‌లు చేశామని వెల్లడించారు. ప్రజలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.

Get Breaking News Alerts From IndiaGlitz