close
Choose your channels

ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్.. కేసీఆర్ సంచలన ప్రకటన

Friday, July 19, 2019 • తెలుగు Comments

ఒకే ఒక్క రూపాయి మాత్రమే.. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గులాబీబాస్, సీఎం కేసీఆర్ పలు సంచలన ప్రకటనలు చేశారు. శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ మున్సిపల్ చట్టం -2019పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో భారీ జరిమానా ఉంటుందని.. ఇంటి కొలతల విషయంలో అబద్ధాలు చెప్తే 25 రెట్లు జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. ప్రజలను నమ్ముతున్నాం.. వారిని విశ్వసిస్తున్నామని.. ఎవరూ లంచాలు ఇవ్వొద్దని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అధికారాన్ని ప్రజలు దుర్వినియోగం చేయొద్దని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జగన్ బాటలో కేసీఆర్!

కాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతపై కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రజావేదికను కూల్చేయడంతో పాటు పలు అక్రమ నిర్మాణాలు కట్టిన యజమానులకు నోటీసులిచ్చారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు కరకట్టపై ఉంటున్న ఇంటిని సైతం కూల్చేందుకు ప్రభుత్వాధికారులు ఇప్పటికే నోటీసులిచ్చి.. త్వరలోనే కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఈ కూల్చివేతల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా అక్రమ కూల్చివేతలపై దృష్టిసారించారు. వైఎస్ జగన్ బాటలోనే ఇప్పుడు కేసీఆర్ కూడా నడుస్తున్నారు.

కూల్చేస్తాం..!

"అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితిలో అనుమతించబోం. ఆగస్టు 15 నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తాం. దేశమే మన దగ్గర నేర్చుకునేలా పాలన సంస్కరణలు తెస్తాం. ప్రజాదర్బార్ నిర్వహించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం. పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం పెరగాలి. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సర్పంచుల పదవులు పోతాయి. 85 శాతం మొక్కలు బతికితేనే పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్‌. మున్సిపల్‌ వార్డుల్లో కౌన్సిలర్‌, ఇన్‌చార్జ్‌ ఆఫీసర్‌కు మొక్కల పెంపకం బాధ్యత 85 శాతం మొక్కలు బతికించాలి.. లేకుంటే సర్వీస్‌ నుంచి తొలగిస్తాం. మున్సిపల్‌ చట్టంలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణానికి టాప్‌  ప్రయారిటీ ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. చట్టం కఠినంగా ఉంది. బీఆర్‌ఎస్ వంటి కేసుల్లో చాలా సందర్భాల్లో హైకోర్టు ముందు కూడా తల దించుకోవాల్సి వచ్చింది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అద్భుతంగా పని చేస్తాం. భారతదేశం అబ్బురపడే విధంగా పని చేయబోతున్నాం. తెలంగాణ మున్సిపల్ చట్టం -2019తో పూర్తి పారదర్శకత వస్తుంది" అని సీఎం కేసీఆర్ తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1 మాత్రమే!

"మున్సిపల్‌ వ్యవస్థను అవినీతి రహితం చేస్తాం. పట్టణాల్లో 75 చదరపు గజాల వరకు పేదల ఇళ్లకు పర్మిషన్లు అక్కర్లేదు. పట్టణాల్లో జీ ప్లస్‌ వన్‌ ఇళ్ల నిర్మాణానికి పరిష్మన్లు అక్కర్లేదు. ప్రాపర్టీ టాక్స్‌ సంవత్సరానికి రూ.100 మాత్రమే. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1 మాత్రమే. మున్సిపాలిటీల్లో అన్ని పర్మిషన్లు పారదర్శకంగా ఉంటాయి. ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌, పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉంటాయి. కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పిస్తున్నాం. మున్సిపాలిటీల్లో లేఔట్లకు కలెక్టర్లే అనుమతి ఇస్తారు. ఫైనల్‌ లేఔట్ వచ్చే వరకు విక్రయాలు జరపకూడదు. పట్టణాలపై ఒత్తిడి తగ్గించడానికి శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తాం" అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

భయపడేది లేదు..!

"ప్రతి యజమాని ఇంటిపై సెల్ఫ్‌ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ప్రతి ఇంటిని స్క్వాడ్స్‌ కొలుస్తారు. ఎవరు ఎప్పుడు, ఎక్కడ కొలుస్తారో చెప్పరు. ట్యాక్స్‌పై అబద్దం చెబితే 25 రెట్లు జరిమానా. ప్రతి మున్సిపల్‌ వార్డులో ప్రజా దర్బార్. వీఆర్వోల అరాచకాలు పెరిగిపోయాయి. వీఆర్వో ఎవరి భూమిని ఎవరికైనా రాసిస్తారు. ఇకపై ఉపేక్షించేది లేదు.. ఎవరికీ భయపడేది లేదు. ఏ ఉద్యోగిని అయినా.. ఎక్కడి నుంచైనా ఎక్కడికి బదిలీ చేయొచ్చు. ప్రజలకు మేలు చేయడానికి చట్టాలు తెస్తాం" అని కేసీఆర్ తెలిపారు.

15 రోజుల్లోనే అనుమతి..!

"మన్సిపాలిటీలకు ప్రభుత్వ కార్యాలయాలు బకాయి ఉండడానికి వీల్లేదు. కొత్త డోర్ నెంబర్లు వేయబోతున్నాం. భవన నిర్మాణ అనుమతులు, ఇతర ధృవీకరణ పత్రాలు సులభంగా పొందడానికే కొత్త చట్టం తెస్తున్నాం. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతి ఇవ్వాలి. 15 రోజుల్లో అనుమతులు రాకున్నా.. ఇచ్చినట్లుగానే భావించవచ్చు. నిర్ణీత సమయంలోగా ధృవీకరణ పత్రాలు ఇవ్వకుంటే బాధ్యులైన ఉద్యోగులను సర్వీస్‌ నుంచి తొలగిస్తాం" అని గులాబీ బాస్ తేల్చిచెప్పారు.

12 గంటలకు మంత్రి ఇంట్లో కనిపిస్తాడు!

రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల పాత్ర మరింత కీలకం చేశామన్నారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం -2019పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పని చేయని సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. "కలెక్టర్ తీసుకున్న చర్యలపై స్టే ఇచ్చే అధికారం మంత్రి నుంచి తొలగించాం. సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంది. ఒక సర్పంచ్‌ను కలెక్టర్ తొలగిస్తే.. సదరు సర్పంచ్ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే, 12 గంటలకు మంత్రి ఇంట్లో కనిపిస్తాడు. సస్పెండ్ ఆర్డర్‌పై ఒంటి గంటకు స్టే వస్తది.. మళ్లా.. కలెక్టర్ ముందు కాలర్ ఎగరేసుకుంటూ కూర్చుంటడు సర్పంచ్. ఇది ప్రస్తుత పరిస్థితి. అందుకే ఇప్పుడు మంత్రి ఇచ్చే స్టే అధికారాన్ని తీసేశాం. నియంత్రణ జరగాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను చట్టంలో తీసుకువచ్చాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ చట్టం చదువుకోవాలి. చట్టం చదవకుండా తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. కొత్త పురపాలక చట్టం కొందరికి నచ్చకపోవచ్చు. ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణలు పొందాలి. చట్టం పాస్ చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నేనే కోరాను" అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz