మోదీ వల్లే జగన్ గెలుపు.. జేసీ జోస్యం..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని.. ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో వైసీపీ విజయదుందుభి మోగించిన విషయం విదితమే. ప్రతిపక్షానికి చేతికందని దూరంలో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అయితే ఇలా భారీ మెజార్టీ సీట్లతో ఎలా అధికారంలోకి వచ్చారనే విషయాలు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. ఆ విషయాలన్నీ ఇక్కడ అప్రస్తుతం అసందర్భం. జగన్ ఇలా అధికారంలోకి రావడం వెనుక ఎవరెవరో ఉన్నారని టీడీపీ నేతలు, ఆఖరికి అధినేత సైతం మీడియా ముందుకొచ్చి సందర్భాలున్నాయి.
అయితే తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మంత్రదండం కారణంగానే సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన.. జగన్ పరిపాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలల గడువు కావాలని ఆయన చెప్పుకొచ్చారు. సీఎంగా జగన్ వ్యవహారం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా.. గత కొన్ని రోజులుగా జేసీ.. మోదీ, బీజేపీ భజన చేస్తున్న విషయం విదితమే. అందుకే తాజాగా మోదీ.. మోదీ అంటూ వార్తల్లో నిలిచారు. అయితే జేసీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.