close
Choose your channels

వడ్డీ వ్యాపారం కాదు.. పాలన సంగతి చూడండి : జగన్‌పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు

Wednesday, April 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గిట్టుబాటు ధరలు రాక... పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో నీటి తీరువా వసూలు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అప్రజాస్వామికంగా ఉందని మనోహర్ భగ్గుమన్నారు. 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం, కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం, భవిష్యత్తులో పంట నష్ట పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అనాలా అంటూ నాదెండ్ల నిలదీశారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి పాలన చేస్తున్నాడా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా అని మండిపడ్డారు.

గత నెలలో ఆస్తి పన్ను కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేశారని.. ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇప్పుడు రైతుల మీద పడ్డారని... నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కాలువల నిర్వహణకు... కనీసం పూడికతీతకు వైసీపీ ప్రభుత్వం పైసా కూడా ఖర్చుపెట్టలేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. స్థానికంగా రైతులే ఆ పనులు చేసుకొంటున్నారని... గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారని.. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించిన మూడు రోజుల్లో ఖాతాలో డబ్బులు వేస్తామని ఊరూరా చెప్పిన సిబిఐ దత్తపుత్రుడు వారాలు, నెలలు గడిచినా డబ్బులు చెల్లించడం లేదని ఎద్దేవా చేశారు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు- రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికీ వడ్డీ లెక్కగట్టి చెల్లించాలని మనోహర్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. ప్రణాళిక లేకుండా, రైతులపట్ల కనీస బాధ్యత లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాలనా వైఫల్యం వల్లే 2019 నుంచి ఇప్పటి వరకూ 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకొనే ఉద్దేశం లేని ఈ ప్రభుత్వం .. వసూళ్లు మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. వడ్డీ వ్యాపారం విడిచిపెట్టి పరిపాలన చేయాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.