close
Choose your channels

Ismart Shankar Review

Review by IndiaGlitz [ Thursday, July 18, 2019 • తెలుగు ]
Ismart Shankar Review
Banner:
Puri Jagannadh Touring Talkies, Puri Connects
Cast:
Ram Pothineni, Nidhhi Agerwal,Nabha Natesh, Satya Dev, Puneet Issar, Ashish Vidyarthi, Sayaji Shinde and Getup Srinu
Direction:
Puri Jagannadh
Production:
Puri Jagannadh, Charmme Kaur
Music:
Manisharma

పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలంటే యూత్‌కు, మాస్‌కు న‌చ్చే ఎలిమెంట్స్ కామ‌న్‌గా ఉంటాయి. ఈయ‌న ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరోకు మాస్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టే బాడీ లాంగ్వేజ్‌తో సినిమా చేస్తుంటాడు. అయితే `టెంప‌ర్‌` త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌కు సరైన హిట్ లేదు. కాబ‌ట్టి చ‌క చ‌కా సినిమాలు చేసే పూరి..కాస్త నెమ్మ‌దిగా చేయాల‌ని ప్లాన్ చేసుకుని చేసిన సినిమాయే `ఇస్మార్ట్ శంక‌ర్`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ హీరోగా ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌క‌ట‌న రాగానే అంద‌రిలో ఓ క్యూరియాసిటీ మొద‌లైంది. అస‌లు పూరి రామ్‌ను ఎలా చూపిస్తాడోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. అందుకు త‌గిన‌ట్లు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో రామ్‌ను త‌న త‌ర‌హా మాస్ స్టైల్లో పూరి ఆవిష్క‌రించాడు. అయితే పూరి ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌కంటే ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో `ఇస్మార్ట్ శంక‌ర్‌`పై అంచ‌నాలు పెరిగాయి .మ‌రి `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో పూరికి హిట్ ద‌క్కిన‌ట్టేనా?  తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ‌:

శంకర్ (రామ్‌) త‌న‌ను ఇస్మార్ట్ అని అనుకుంటాడు. అంద‌రూ ఇంట్లో పెరిగితే త‌ను పెంట్లో పెరిగాన‌ని అత‌ని ఫీలింగ్‌. ఎందుకంటే అత‌ని కాకా (మ‌దుసూద‌న‌రావు) రౌడీ. అత‌ను చెప్పిన ప‌న‌ల్లా చేయ‌డ‌మే శంక‌ర్‌కు తెలిసిన ప‌ని. అలా ఒక‌సారి కాకా చెప్పాడ‌ని ఒక‌త‌న్ని చంపుతాడు శంక‌ర్‌. అందుకు బ‌దులుగా సంచి నిండా డ‌బ్బులు తీసుకుంటాడు. త‌ను ప్రేమించిన చాందినిని తీసుకుని గోవా వెళ్తాడు. అక్క‌డ జ‌రిగిన కాల్పుల్లో త‌న ప్రేయ‌సిని కోల్పోతాడు. అక్క‌డ పోలీసుల మాట‌ల్లో భాగంగా తాను చంపింది ఎక్స్ మినిస్ట‌ర్‌ని అని తెలుస్తుంది. అస‌లు త‌న‌తో అంత ప‌ని ఎందుకు చేయించాడోన‌ని క‌నుక్కోవ‌డానికి కాకా ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. అత‌నితో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో కాకాను చంపేస్తాడు. కాకాకు సుపారి ఇచ్చిన జ‌మాల్ గురించి తెలుస్తుంది. అత‌న్ని క‌లుసుకోవ‌డానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ సీబీఐ అరుణ్‌ని క‌లుస్తాడు. వీరిద్ద‌రికీ తెలియ‌కుండా, రౌడీ మూక‌లు వీరిపై దాడి చేస్తారు.  సీబీఐ అరుణ్  కాల్పుల్లో చ‌నిపోతాడు. ఆ స్పాట్‌లోనే గాయ‌ప‌డిన శంక‌ర్ సీబీఐ ఆఫీస‌ర్ (సాయాజీ షిండే)కు దొరుకుతాడు. సారా సాయంతో అరుణ్  మెమ‌రీని శంక‌ర్ బుర్ర‌లోకి మారుస్తారు సీబీఐ అధికారులు. డేటా మొత్తం ట్రాన్స్ ఫ‌ర్ అయిందా?  శంక‌ర్ డ‌బుల్ ఇస్మార్ట్ గా మారాడా?  అరుణ్ ప్రేయ‌సి అయిన సారాను శంక‌ర్ ఎలా చూశాడు? అత‌ని క్రిమిన‌ల్ బ్రైన్ మొత్తం పోయి, సీబీఐ బ్రెయిన్ వ‌చ్చిందా?  లేకుంటే సీబీఐ విష‌యాల‌ను క్రిమిన‌ల్ ప‌నుల‌కు వాడుకున్నాడా? ఇంత‌కీ చ‌నిపోయిన వ్య‌క్తికి, అత‌ని కుమారుడికి, బావ‌మ‌రిదికీ, శంక‌ర్‌కు, కాకాకు ఉన్న సంబంధం ఏంటి? ఆఫీస‌ర్ ధ‌ర‌మ్ ఈ విష‌యంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో తెలిసే విష‌యాలు.

ప్ల‌స్ పాయింట్లు:

రామ్ ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్‌. బిజినెస్‌మ్యాన్‌లో మ‌హేష్ ఒన్ మ్యాన్ షో చేసిన‌ట్టు ఈ సినిమాలో రామ్ ఒన్ మ్యాన్ షో చేశాడ‌న్న‌మాట‌. అత‌ను పూర్తిగా మాస్‌గా ఉంటాడు. అత‌ని మాట‌ల్లోనే మాస్ విష‌యాలుంటాయి. అత‌ను చెప్పే డైలాగుల్లోనూ బీప్‌లే ఎక్కువ‌గా ఉంటాయి. అత‌నిక‌న్నా ఒక ఆకు ఎక్కువే చ‌దివిన‌ట్టు క‌నిపిస్తుంది న‌భా న‌టేష్‌. ఇద్ద‌రూ తెర‌మీద క‌నిపించినంత సేపు పోటాపోటీగా మాస్‌కు న‌చ్చుతారు. అందాల ఆర‌బోత‌లో న‌భా న‌టేష్‌కు, ఏ మాత్రం త‌గ్గ‌కుండా క‌నిపించింది నిధి అగ‌ర్వాల్‌. పాట‌లు మాస్‌కు బాగా న‌చ్చుతాయి. రామ్ వేసిన స్టెప్పులు బావున్నాయి. ఫైట్లు కూడా బాగా కంపోజ్ చేశారు. చాందిని చ‌నిపోయిన‌ప్పుడు రామ్ ఆమెను ఒళ్లోకి తీసుకుని బాధ‌ప‌డే షాట్ చాలా బావుంది. కెమెరా ప‌నిత‌నం బావుంది.

మైన‌స్ పాయింట్లు:

సినిమా విల‌న్ ఎవ‌రు అని వెతుకులాట‌తో ముడిప‌డి ఉంటుంది. దాంతో రామ్ చేసే పోరాటం వీక్‌గా అనిపిస్తుంది. నాయ‌కుడు ఎంత బ‌ల‌మైన వాడయినా స‌రే, ఎదుటివ్య‌క్తితో ఆడే మెంట‌ల్ గేమ్‌, లేకుంటే ఫిజిక‌ల్ గేమ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ చిత్రంలో ఫిజిక‌ల్ గేమ్ ఆడ‌టానికి విల‌న్ ఎవ‌రో తెలియ‌దు. ఆ విష‌యం ర‌హ‌స్యంగా ఉంటుంది. పైగా మెంట‌ల్ గా కూడా స్ట్రాంగ్ గేమ్ కాదు. ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్‌ప్లే కూడా లేదు. డ‌బుల్ చిప్ అనే కాన్సెప్ట్ త‌ప్ప మిగిలిన‌వి ఏవీ అంత‌గా ఆక‌ట్టుకోవు.

విశ్లేష‌ణ‌:

పూరి జ‌గ‌న్నాథ్ తాజా చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. రామ్ ఇప్ప‌టిదాకా ట్రై చేయ‌ని కొత్త జోన‌ర్‌. అలాగే పూరి జ‌గ‌న్నాథ్ కు కూడా కొత్త జోన‌ర్‌. సినిమా సై - ఫై థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌టికీ, పూరి త‌ర‌హాలో మాస్‌గా సాగింది. రామ్ లిట‌ర‌ల్‌గా స్క్రీన్‌ని ఆక్ర‌మించేశాడు. నిన్న‌మొన్న‌టిదాకా చాక్లెట్ బోయ్ ఇమేజ్‌తో న‌టించిన రామ్ ఉన్న‌ట్టుండి స‌డ‌న్‌గా న్యూ గెట‌ప్‌కి చేంజ్ అయ్యాడు. ఆ చేంజ్ కూడా ఎక్క‌డా కృత్రిమంగా లేదు. డైలాగుల‌తో స‌హా అత్యంత స‌హ‌జంగా అనిపించాడు. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ కూడా బావుంది. రామ్‌కి ఈ సినిమాలో గ‌ట్టి పోటీగా నిలిచింది న‌భా. అటు అందంగా క‌నిపించ‌డ‌మే కాదు, ఆమెకు రాసిన డైలాగులు, చెప్పిన డ‌బ్బింగ్ కూడా ఆస‌మ్ అనిపించాయి. నిధి అగ‌ర్వాల్ చూడ్డానికి బాగా ఉన్నా, భావోద్వేగాల‌ను ప‌లికించ‌లేక‌పోయింది. సినిమాలో డైలాగుల మీద పెట్టిన శ్ర‌ద్ధ‌, స‌న్నివేశాల మీద ఇంకాస్త పెట్టి ఉంటే బావుండేది. స‌త్య‌దేవ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. డ‌బుల్ చిప్ అనే విష‌యం కామెడీగా అక్క‌డ‌క్క‌డా నవ్వించినా, లాజిక్‌కు నిల‌బ‌డ‌దు. లాజిక్కులు లేకుండా ఏదో కొత్త త‌ర‌హాగా ట్రై చేశార‌ని చూస్తే న‌చ్చుతుంది. పాట‌లు తీయ‌డంలో పూరి మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించారు. గోవా లొకేష‌న్ల‌లో తీసిన పాట‌లు బావున్నాయి. రామ్ వేసిన స్టెప్పులు, చేసిన ఫైట్లు కూడా మాస్‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్ అడుగడుగునా ఉన్నాయి. లాజిక్‌ను, క‌థ‌ను, క‌థ‌నాన్ని ప‌ట్టించుకోకుండా, జ‌స్ట్ ఫ‌ర్ ప‌న్ కోస‌మో, న్యూ ఎక్స్ పీరియ‌న్స్ కోస‌మో అయితే స‌ర‌దాగా చూడొచ్చు.

బాట‌మ్ లైన్‌: ఇస్మార్ట్... జ‌ర తెలంగాణ స్టైల్‌... మ‌రింత మాస్‌!

Read iSmart Shankar Review in English

Rating: 2.5 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE

Get Breaking News Alerts From IndiaGlitz