close
Choose your channels

ఆసక్తికరంగా అఖిల ప్రియ కేసు.. ఆ మూవీ చూసే కిడ్నాప్‌కు స్కెచ్..

Thursday, January 14, 2021 • తెలుగు Comments

ఆసక్తికరంగా అఖిల ప్రియ కేసు.. ఆ మూవీ చూసే కిడ్నాప్‌కు స్కెచ్..

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి అఖిల ప్రియ ఈ కేసులో అరెస్ట్ కావడంతో ఈ కేసుకు మరింత హైప్ వచ్చింది. ఈ కిడ్నాప్ ఉదంతానికి ప్రేరణ ఓ బాలీవుడ్ సినిమా కావడం.. ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటించిన "స్పెషల్ 26" చిత్రాన్ని చూసి ఈ కిడ్నాప్‌నకు స్కెచ్ గీసినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆది నుంచి కిడ్నాప్ ఉదంతం సినీ ఫక్కీలో జరిగింది అని మీడియా, పోలీసులు చెబుతూ వస్తున్నారు. కానీ నిజంగానే ఓ సినిమా ఆధారంగా కిడ్నాప్‌నకు అఖిలప్రియ అండ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

ఈ కిడ్నాప్ చేయడానికి ముందు అఖిల ప్రియ.. చంద్రహాస్‌తో అక్షయ్‌కుమార్ సినిమా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అఖిలప్రియ ఆదేశాలతోనే అక్షయ్‌కుమార్ సినిమాను కిడ్నాప్ గ్యాంగ్‌కు అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్, చంద్రహాస్ చూపించినట్లు సమాచారం. దీనిని చూసిన అనంతరమే ఐటీ అధికారులుగా ఎలా నటించాలనే దానిపై వారం పాటు గ్యాంగ్‌కు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. "స్పెషల్ 26" ఆధారంగా యూసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌లో కిడ్నాప్‌‌నకు స్కెచ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్కూలులోనే వాహనాల నంబర్ ప్లేట్‌లను స్కూల్లో మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

కాగా.. అఖిలప్రియ మూడో రోజు కస్టడీ ముగిసింది. విచారణలో ఆమెను పోలీసులు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే వీటిలో చాలా ప్రశ్నలకు అఖిలప్రియ మౌనం వహించినట్టు తెలుస్తోంది. మూడు రోజుల విచారణలో భాగంగా పలు కీలక విషయాలను పోలీసులు తెలుసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పరారీలో ఉన్న గుంటూరు సీను, భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారనే దానిపై అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్, ఇతర ఆధారాలను అఖిలప్రియ ముందుంచి ప్రశ్నించారనే ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది.

Get Breaking News Alerts From IndiaGlitz