close
Choose your channels

TDP Jan Sena:టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

Thursday, February 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ముగిసింది. ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన ఇరు పార్టీల కార్యకర్తలను అభినందిస్తూ ఒక తీర్మానం... మీడియాపై దాడులను తప్పుబడుతూ రెండో తీర్మానం చేశారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని.. వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్రం పరువు తీసిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారన్నారు. జగన్ పాలనను ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ-జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఓడిపోతామని తెలిసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలు మీడియాపై దాడులకు తెగబడుతున్నారని.. తమ సభలకు వచ్చే వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించారని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తామని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు. అలాగే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలన్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మళ్లీ జగన్ అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నామని వివరించారు. పొత్తుల్లో కొన్ని త్యాగాలు తప్పవని చంద్రబాబు, పవన్ చెప్పిన విషయాన్ని అచ్చెన్న ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లును నియమించనున్నామని ధర్మాన చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ధర్మాన వ్యాఖ్యలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

ఇక నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేటి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. విపక్షాల ఓట్లు చీలకూడదని పవన్ పలుమార్లు చెప్పారని.. రెండు పార్టీలు కలిసి పనిచేసుకునే సమయం వచ్చిందన్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరుతున్నామని నాదెండ్ల తెలిపారు. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో రెండు పార్టీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకానున్నారని చెప్పారు. అలాగే 500 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించామన్నారు. దాదాపు ఆరు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.