close
Choose your channels

Metro Rail:ప్రయాణీకులకు షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో.. డిస్కౌంట్‌లపై కోత, ఆ కార్డును అన్ని వేళల్లో వాడలేరు

Saturday, April 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాదీలకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. పలు రాయితీల్లో కోత విధిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు .. తిరిగి రాత్రి 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. గతంలో మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఛార్జీలో పది శాతం డిస్కౌంట్ వుండేది. అలాగే సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో తెలిపింది. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు ధరను రూ.59 నుంచి 99 కి పెంచనున్నారు. అలాగే కొత్తగా ఈ కార్డు తీసుకునేవారు రూ.100 చెల్లించాలని అధికారులు వెల్లడించారు. వీటితో పాటు కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను కూడా పెంచుతామని తెలిపారు.

కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న మెట్రో :

కాగా.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది. కరోనాకు ముందు ప్రతినిత్యం లక్షల్లో ప్రయాణీకులను గమ్యస్థానాలకు సేవలందించిన మెట్రోకు... కోవిడ్ కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుస లాక్‌డౌన్‌లకు తోడు.. మహారాజ పోషకుల్లాంటి ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు కావడంతో హైదరాబాద్ మెట్రో వెలవెలబోయింది. దీంతో తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మెట్రో యాజమాన్యం కోరింది. అయితే తర్వాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కార్యాలయాలు తెరుచుకోవడంతో మెట్రో మునుపటి ఫామ్‌ని అందుకుంది.

సూపర్ సేవర్ కార్డుకు విశేష ఆదరణ :

ఇదిలావుండగా.. మెట్రో రైల్లో ‘సూపర్ సేవర్‌ కార్డు’ పేరుతో కొత్త ఆఫర్‌ను గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్డుతో సెలవు దినాల్లో కేవలం రూ.59తో రోజంతా మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని మెట్రో ఎండీ చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవు దినాల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు. ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే (డిసెంబరు 26), బోగీ, సంక్రాంతి, శివరాత్రి దినాల్లో ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనిని రూ.59 నుంచి రూ.99కి పెంచడంపై ప్రయాణీకులు భగ్గుమంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.