close
Choose your channels

‘వకీల్ సాబ్‌’కు హైకోర్టు షాక్...

Sunday, April 11, 2021 • తెలుగు Comments

‘వకీల్ సాబ్‌’కు హైకోర్టు షాక్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. ఈ‌ సినిమాకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీపి కబురు అందించిన కొద్ది గంటల్లోనే డివిజన్ బెంచ్ సవరించి షాక్ ఇచ్చింది. మూడు రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. టికెట్ ధరల పెంపు అనేది ఈ ఒక్కరోజు(శనివారం) మాత్రమే అమలు చేయాలని డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. రేపటి(ఆదివారం) నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ధరలు ఉంటాయని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన టికెట్ల విషయంలో మాత్రం రేపటి షోల వరకూ హైకోర్టు వెసులుబాటు కల్పించింది.

ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు అడ్డంకులు సృష్టించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు హైకోర్టును ఆశ్రయించగా... వారికి ఊరటనిచ్చే తీర్పును కోర్టు వెలువరించింది. నిజానికి పవర్ స్టార్ సినిమాయే కాదు.. ఏ పెద్ద హీరో సినిమా విడుదలైనా బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం థియేటర్ల యజమానులకు ఉంటుంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమా రిలీజ్ అనగానే.. థియేటర్ల యాజమాన్యాలు సైతం తాము మరింత కోలుకునేందుకు ఈ సినిమా పెద్ద అవకాశమని భావించాయి. టికెట్ల రేట్లను పెంచాలన్న నిర్ణయానికి వచ్చాయి.

అయితే ఈ సినిమా విషయమై రాత్రికి రాత్రి కొన్ని జీవోలు విడుదలయ్యాయి. ప్రత్యేకంగా టికెట్ల రేట్లను ప్రకటించి... అంతకు మించి అమ్మితే థియేటర్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్ర అని.. రాజకీయ కక్షను సినిమా మీద చూపిస్తున్నారని అభిమానులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టు‌ను సంప్రదించారు. వారికి సానుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో పవన్ ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే కొద్ది గంటల్లోనే ఈ తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది.

Get Breaking News Alerts From IndiaGlitz