close
Choose your channels

‘సలార్’లో శ్రుతి హాసన్ ఫిక్స్

Thursday, January 28, 2021 • తెలుగు Comments

‘సలార్’లో శ్రుతి హాసన్ ఫిక్స్

విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శ్రుతి హాసన్.. ఆ తరువాత తండ్రి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలుత ఐరన్ లెగ్ అని టాక్ ఉన్నప్పటికీ దానిని సైతం చెరపేసుకుని అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగు, తమిళ భాషలకు చెందిన స్టార్ హీరోలతో నటించింది. వ్యక్తిగత కారణాలతో దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరమైన శ్రుతి ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసగా సినిమాలు చేస్తోంది.

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో శ్రుతి హాసన్ మంచి హిట్ కొట్టింది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఇవాళ శ్రుతి 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సలార్’ యూనిట్ శ్రుతి గురించి అధికారిక ప్రకటన చేసింది. శ్రుతికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమె తమ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. ‘ఎంతో అందమైన శ్రుతిహాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘సలార్‌’ చిత్రంలో మీరు కూడా భాగమైనందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ గోదావరి ఖనిలో ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే గోదావరిఖనిలో భారీసెట్‌ వేసినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz