close
Choose your channels

CM Jagan:నా చావుకు సీఎం జగనే కారణం.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం..

Monday, December 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఎం జగన్‌ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేసిన ప్రభుత్వ టీచర్ చావుబతుకల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన మల్లేష్ విడపనకల్లు మండలం పాల్తూరు ఎంపీపీ పాఠశాలలో ఎస్జిటిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐదేళ్లు కావొస్తున్నా సీపీఎస్ రద్దు చేయకపోవడం, ఐదో తేదీ దాటినా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ సూసైడ్ లేఖలో తెలిపారు. చేసిన తప్పులకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామంటూ ఐదు పేజీల లేఖలో ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

అసలు ఏం జరిగిందంటే..

ప్రభుత్వ టీచర్ మల్లేష్ వైఎస్ కుటుంబానికి వీరాభిమాని. గత ఎన్నికల్లో జగన్ మీద అభిమానంతో తనతో పాటు తన తోటి ఉద్యోగులు, పవన్ కల్యాణ్‌ అభిమానులతో వైసీపీకి ఓటేయించారు. కానీ ఐదేళ్లు అవుతున్నా సీపీఎస్ రద్దు చేయకపోవడం, జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఉరవకొండ మండలం పెన్నా అహోబిలం దగ్గర విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అటుగా వెళుతున్న కొందరు ఆయనను చూసి ఆసుపత్రికి తరలించారు. తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల సూసైడ్ లెటర్ రాశారు.

సూసైడ్ లెటర్ సారాంశం..

"వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న పిచ్చి అభిమానమే నా పాలిట మరణ శాసనమైంది. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను నేను నమ్మాను. సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేస్తానని, ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు సకాలంలో ఇస్తామని హామీ ఇవ్వడంతో నమ్మా. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మాటిచ్చాడంటే అవి కచ్చితంగా నెరవేరుస్తాడని తోటి ఉద్యోగులతో తరచూ గొడవ పడేవాడిని. 2019 ఎన్నికల్లో మా కుటుంబంలోని ఓట్లన్నీ వైసీపీకే వేశాం. కానీ ఇప్పుడు బాధపడుతున్నా. కనీసం జీతాలు కూడా సరిగా వేయకుండా వేధిస్తున్నాడు. ఒక నెల, రెండు నెలలు ఆలస్యమైతే తట్టుకోవచ్చు. ప్రతినెలా ఆలస్యమవుతుండడంతో ఈఎంఐలు, చిట్టీల వాయిదాలు కట్టుకోలేకపోతున్నా. ఇల్లు కట్టుకోవడం నా చిరకాల కోరిక. దానిని కూడా కట్టుకోలేకపోతున్నా. పీఆర్సీ విషయంలో జగన్‌ చాలా మోసం చేశారు. ఐఆర్‌ 27శాతం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ పీఆర్సీ రూపంలో వెనక్కి లాగేసుకున్నారు. ఇది జగన్‌ చేసిన అతి పెద్ద ద్రోహం"అని తెలిపారు.

చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. జగన్‌ అంతకుమించి ఇస్తారనుకుంటే 23 శాతం ఇచ్చారు. రెండు డీఏలు పెట్టినందుకే చంద్రబాబును కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాం. ఆయనను కాదనుకున్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జగన్‌ కంటే చంద్రబాబే బెటర్‌ అని జగనే నిరూపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రతినెలా ఒకటో తేదీన కచ్చితంగా జీతాలు వేసేశారు. వైసీపీ పాలనలో ఎందుకు వేయలేకపోతున్నారు? మా జీవితాలను నాశనం చేయొద్దు. దసరా సెలవుల్లోనే చనిపోదామనుకుని లెటర్‌ రాసి పెట్టుకున్నా. నేను చనిపోయిన తర్వాతైనా నాకు రావాల్సిన బెనిఫిట్స్‌ నా కుటుంబానికి త్వరగా వచ్చేలా ముఖ్యమంత్రి చూడాలి. ఉద్యోగులారా ఐఆర్‌కు ఆశ పడి ఓటేశారా.. ఇక అంతే. మళ్లీ అధికారంలోకి వస్తే.. సీఎంకు అవగాహన లేక ఐఆర్‌ ఇచ్చారనీ, ఇప్పుడు ఇవ్వడం కుదరదని వెనక్కి లాగేసుకుంటారు. బాగా ఆలోచించి ఓటు వేయండి. నాలాగా ఏ ఉద్యోగీ చనిపోకుండా చూడండి" అని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడే తన చావుకు సీఎం జగనే కారణమంటూ సూసైడ్‌ లేఖలో పేరు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.