close
Choose your channels

‘తప్పకుండా.. త్వరలోనే అన్నా..’ చిరుతో వైఎస్ జగన్!

Monday, October 14, 2019 • తెలుగు Comments

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు ఇవాళ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమవారం నాడు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న మెగాస్టార్‌ చిరంజీవి అక్కడ్నుంచి నేరుగా.. సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చిరు దంపతులను వైఎస్ జగన్ సాదరంగా.. పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. మరోవైపు.. ముఖ్యమంత్రిని మెగాస్టార్‌ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తోంది.

సుమారు గంటకు పైగా జగన్-చిరు మధ్య సైరా సినిమాతో పాటు పాదయాత్ర, ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం చిరు ఫ్యామిలీతో కలిసి జగన్ దంపతులు విందు భోజనం చేశారు. ‘సైరా’ సినిమా చూడాలని వైఎస్ జగన్‌ను చిరు దంపతులు కోరారు. ఇందుకు జగన్ నవ్వుతూ తప్పకుండా అన్నా.. త్వరలోనే ఫ్యామిలీతో చూస్తానని చెప్పినట్లు సమాచారం. జగన్‌‌ను చిరు సత్కరించగా.. జగన్ సతీమణి భారతీకి.. చిరు భార్య సురేఖ చీరను బహుకరించారు. ఈ సందర్భంగా భారతీ-సురేఖ కాసేపు ముచ్చటించుకున్నారు.

అంతేకాదు.. ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌తో చిరంజీవి నిశితంగా చర్చించారని వార్తలు వినవస్తున్నాయి. విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగన్ కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో... ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ అంశంపై సీఎం జగన్‌తో చర్చలు జరిపారని సమాచారం.

‘సైరా’తో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని.. చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలంటూ వైఎస్ జగన్ ఆకాంక్షించారు. జగన్ వ్యాఖ్యలపై మెగాభిమానులు, వైసీపీ వీరాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz