Ram Charan, Amit Shah:అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ.. చివరి వరకు లీక్ కాకుండా జాగ్రత్తలు, బీజేపీ పెద్దల వ్యూహామేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు యువ హీరో రామ్‌చరణ్ కలిశారు. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో అమిత్ షాను ఆయన నివాసంలో తండ్రీకొడుకులిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా చరణ్‌ను హోంమంత్రి శాలువాతో సత్కరించారు. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో పాటు ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించడం పట్ల చరణ్‌ను అమిత్ షా అభినందించారు. అనంతరం ముగ్గురూ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించి అమిత్ షా ట్వీట్ చేశారు. భారతీయ చిత్రసీమలోని ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి , ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని అమిత్ షా ప్రశంసించారు. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం అమిత్ షాను కలవడం పట్ల ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో తాను భాగం కావడం థ్రిల్లింగ్‌గా అనిపించిందన్నారు.
అమిత్ షాతో తండ్రీ కొడుకుల భేటీపై ఆసక్తికర చర్చ :
కాగా.. అమిత్ షాతో చిరు, చరణ్‌లు భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ సమావేశానికి సంబంధించి మీడియాలో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లాస్ ఏంజెల్స్ నుంచి నేరుగా హైదరాబాద్ రాకుండా నేరుగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు చరణ్. ఇండియా టుడే కాన్క్లేవ్లో ప్రధాని నరేంద్ర మోడీ, సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులతో చరణ్ వేదిక పంచుకుంటారని మాత్రమే మీడియాకు సమాచారం అందింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అమిత్ షాతో వీరిద్దరూ భేటీకావడం కలకలం రేపింది.
కాపుల కోసమే చిరు, చరణ్‌లకు అంత ప్రాధాన్యమా :
వచ్చే కొద్దినెలల్లో ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో బలమైన శక్తిగా వున్న కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్ధతు బీజేపీకే అని చెబుతున్నప్పటికీ.. ఎక్కడా మిత్రధర్మం పాటించడం లేదు. ఈ పొత్తు కేవలం కాగితాలకు, మాటలకు మాత్రమే పరిమితమైంది. నిన్న గాక మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనూ మిత్రుడిగా తాను సహకరిస్తానని అన్నా.. బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని, తాను చెప్పినట్లు చేసుంటే తనకు తెలుగుదేశంతో అవసరం వచ్చేది కాదని పవన్ స్పష్టం చేశారు.
కాపులకు తొలి నుంచి బ్రాండ్ ఐకాన్‌గా చిరు :
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, కాపులు చేజారిపోకుండా.. ఆ సామాజిక వర్గానికి తొలి నుంచి బ్రాండ్ ఐకాన్‌గా వున్న చిరంజీవికి బీజేపీ అమిత ప్రాధాన్యం ఇస్తోంది. అప్పట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానితో పాటు వేదిక పంచుకునే అవకాశాన్ని కల్పించింది. తాజాగా ఇప్పుడు మెగా వారసుడు రామ్‌చరణ్‌ని కూడా ఢిల్లీకి పిలిపించి, మోడీ పక్కనే కూర్చోబెట్టింది. అది ముగిసిన వెంటనే అమిత్ షా తండ్రీకొడుకులిద్దరిని కలిశారు. ఈ పరిణామాలన్నింటి వెనుక కమలనాథుల వ్యూహం వుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం వస్తేనే కానీ బీజేపీ వ్యూహాలు అంతుచిక్కవు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments