close
Choose your channels

టీటీడీని ధారాదత్తం చేసేందుకు కుట్ర: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

Friday, February 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బలహీనత వల్ల ఆఖరికి టీటీడీ కూడా చేయి జారిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంతటి బలహీనమైన ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు టీటీడీని తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. టీటీడీ ఆధీనంలో ఉన్న రూ.10వేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల ఆస్తులపై బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు కన్నేశాయని చింతా మోహన్ పేర్కొన్నారు.

ఈ మేరకు ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధ్యక్షతన రహస్య సమావేశం జరిగిందని చెప్పి చింతా మోహన్ సంచలనం సృష్టించారు. ప్రధానంగా టీటీడీని ఎలాగైనా తమ చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్న బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు దీనిపై లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లు తెలిసిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా ప్రైవేట్‌ పరం చేయాలనుకుంటున్నారో అదే విధంగా టీటీడీని ధారాదత్తం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ వ్యవహారాన్నంతటినీ తాను తాను కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఖండిస్తున్నానన్నారు. రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ ఏక కంఠంతో వ్యతిరేకించాలని మోహన్‌ పిలుపునిచ్చారు.

ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాబోతోందన్న వార్త ఏపీని కుదిపిస్తోంది. ఎంతో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయవద్దని ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇలాంటి తరుణంలో చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఈ విషయం కాస్తా బలంగా ప్రజల్లోకి వెళ్లిందంటే ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోందంటే అగ్గిమీద గుగ్గిలమవుతున్న ఏపీ ప్రజానీకం.. టీటీడీ విషయంలో ఏదైనా జరిగితే ఏమాత్రం హర్షించరు. ఒక్క ఏపీ ప్రజానీకమే కాదు.. యావత్ దేశమే నిప్పులు చెరుగుతుంది. మరి ఇలాంటి వ్యాఖ్యలను చింతా మోహన్ ఏం ఆధారాలతో చేశారనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.