close
Choose your channels

BiggBoss : సూర్య- ఆరోహిల రొమాన్స్... టాస్క్‌ పేరిట కోరికలు తీర్చుకున్న కంటెస్టెంట్స్

Wednesday, September 28, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ నామినేషన్‌ల సందర్భంగా ఇనయాను టార్గెట్ చేస్తూ ఏజ్ షేమింగ్ జరగడంతో సోషల్ మీడియా అట్టుడుకుతోంది. దీంతో అసలు శ్రీహాన్ పెద్దోడా..? ఇనయా పెద్దదా అంటూ నెటిజన్లు గూగుల్‌ను జల్లెడ పడుతున్నారు. ఈ గొడవతో గీతూను పక్కకునెట్టి ఇనయా బిగ్‌బాస్‌లో డామినేట్ చేస్తోంది. కుర్రకారు కూడా ఈమెకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టినట్లు సోషల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. సోమవారం జరిగిన శ్రీహాన్ ఎపిసోడ్‌తో ఇనయా గ్రాఫ్ ఓ రేంజ్‌లో పెరిగిందని చెప్పొచ్చు. ఓటింగ్‌లోనూ రేవంత్ తర్వాత ఇనయా సెకండ్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది.

అయితే సోమవారం శత్రువుల్లా కొట్టుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మంగళవారం మాత్రం కాస్త చల్లబడ్డారు. రొమాన్స్ అనే వెలితి కనిపించడంతో దీనిని పూరించడానికి ఆరోహి, ఆర్జే సూర్యలు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరూ హగ్ చేసుకుని రొమాన్స్ పండించారు. ఆ తర్వాత స్టోర్ రూమ్‌లో ముచ్చట్లు పెట్టుకున్నారు. వీళ్ల కథ ఏంటో.. వీళ్ల లవ్ ట్రాక్ ఏంటో కానీ ఏదో విధంగా జనం మాట్లాడుకునేలాగా, కెమెరాలో పడటానికి మాత్రం తెగ ట్రై చేశారు. పైగా ఈవారం ఇద్దరూ నామినేషన్స్‌లో వుండటంతోనే ఈ రొమాన్స్‌కి తెరదీశారా అనిపిస్తోంది.

ఇదిలావుండగా.. గతంలో కంటెస్టెంట్స్‌లో ఒకరికి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ ఛాయలు ఏమాత్రం కనిపించడం లేదే అనుకుంటున్న టైంలో మన చంటికి బిగ్‌బాస్ నుంచి కబురొచ్చింది. హౌస్‌మేట్స్ అందరికీ హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ ఇచ్చి.. చంటికి సెపరేట్‌గా సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్, గ్లామ్ హోటల్ అనే రెండు హోటల్స్‌లో కంటెస్టెంట్లు సర్వెంట్లుగా, చెఫ్‌లుగా, గెస్ట్‌లుగా వ్యవహరిస్తూ వుంటారు. చంటి మాత్రం హెల్పర్‌గా వుండాలి. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం.. ఇతను గెస్ట్‌లను బీబీ హోటల్ నుంచి గ్లామ్ హోటల్‌కి పంపించాల్సి వుంటుంది.

గ్లామ్‌ హోటల్‌లో ఫైమా మేనేజర్‌గా.. శ్రీసత్య, ఆరోహి, కీర్తి, వాసంతిలు సర్వెంట్లుగా వుంటారు. అటు బీబీ హోటల్‌లో సుదీప మేనేజర్‌గా... రేవంత్, బాలాదిత్య, గీతూ, మెరీనాలు సర్వెట్లుగా వుంటారు. ఇనయాది రాయల్ ఫ్యామిలీ. రోహిత్ తన భార్య పారిపోవడంతో ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిన అతిథి, శ్రీహాన్ హీరోగా, సూర్య మతిస్థిమితం లేని ఫుడ్ రివ్యూవర్‌గా, రాజ్, అర్జున్‌లు సినిమా తీయడం కోసం లోకేషన్ చూడటానికి వచ్చిన వారిగా వ్యవహరిస్తారు. ఈ టాస్క్‌లో గెస్ట్‌లు సర్వెంట్ల చేత పనిచేయించుకుని డబ్బులివ్వాలి... హోటల్‌లోని స్టాఫ్ వీరిని బాగా చూసుకుని డబ్బులు పొందాలి. ఎవరి వద్ద ఎక్కువ వుంటే వారిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేస్తారు.

ఈ టాస్క్ బిగ్‌బాస్ హౌస్‌ని మసాజ్ సెంటర్‌గా, లవర్స్ అడ్డాగా, పబ్‌గా మార్చేసింది. ఇక శ్రీసత్య ఈ టాస్క్‌లో అదరగొట్టేసింది. తన వెంట పడుతోన్న అర్జున్‌ని టార్గెట్ చేసింది. అర్జున్ కూడా ఇదే అదనుగా శ్రీసత్యతో సేవలు చేయించుకున్నాడు. మీద చేయివేసి ఫోటో తీసుకోవడంతో పాటు ఆమ్లేట్ వేయించుకున్నాడు, అన్నం తినిపిపించుకున్నాడు. కానీ మన శ్రీసత్య తక్కువుది కాదుగా. సేవలన్నింటికీ డబ్బులు తీసుకుని తెలివిగా టాస్కును ఆడింది. అయితే ఆర్జే సూర్య అందరికంటే రెచ్చిపోయాడు. ఏకంగా బట్టలు విప్పి మరి ఆరోహితో మసాజ్ చేయించుకోవడంతో పాటు హగ్ కూడా చేసుకున్నాడు. పనిలో పనిగా టాస్క్‌లో భర్త లేని ఒంటరి మహిళగా వున్న మెరీనాను.. భార్య కోసం వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిగా రోహిత్ హగ్‌ చేసుకున్నాడు. మొత్తం మీద గత కొన్నిరోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత మసాలా అందింది. చంటి తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ మొదలుపెట్టలేదు. అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించి శ్రీసత్య టాప్‌లో నిలిచింది. మరి రేపు ఈ టాస్క్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.