close
Choose your channels

BiggBoss: తిని, పడుకోవడానికి వచ్చారా... డియర్ నైన్ అంటూ నాగ్ చీవాట్లు, ఎలిమినేట్ అయిన షాని!

Sunday, September 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాధారణంగా బిగ్‌బాస్ అంటే గొడవలు, అలకలు, టాస్క్‌లు అనుకుంటారు. కానీ మన లోపలి మనిషిని నలుగురికి పరిచయం చేసే ఒక అరుదైన ప్రయత్నం. నిత్యం కెమెరాల ముందు నటించే స్టార్స్ నిజజీవితంలో ఎలా వుంటారు. వారి అలవాట్లు, అభిరుచులు, మనస్తత్వం ఇతర విషయాలను అత్యంత సహజంగా ఆవిష్కరించేదే బిగ్‌బాస్ షో. అందుకే అన్ని భాషల్లోనూ దీనికి నీరాజనాలు పలుకుతున్నారు. అలాంటి కార్యక్రమంలో తమను తాము నిరూపించుకోవాల్సింది పోయి. తిని కూర్చుంటే ఆడేవాళ్లకి, ప్రేక్షకులకి, నిర్వాహకులకు ఉపయోగం నిల్. అందుకే ఈ వారం తెలుగు బిగ్‌బాస్‌‌లో కంటెస్టెంట్స్‌కి క్లాస్ పీకారు హోస్ట్ నాగార్జున. రియాల్టీ షోలో రియల్‌గా ఆడేవారి సంఖ్య తగ్గిపోయిందని, అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ మండిపడ్డారు. బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చారంటూ చీవాట్లు పెట్టారు. సేఫ్ గేమ్ ఆడుతున్న వారి లగేజ్‌లను స్టోర్ రూమ్‌లో పెట్టించారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో గలాటా గీతూ, ఫైమా, రేవంత్ ఇలా ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్లంతా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే శనివారం ఎపిసోడ్ ప్రారంభంకాగానే తినటానికి, పడుకోవడానికి ఈ షోకి వచ్చానంటే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్. అంతేకాదు.. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదని, కానీ ఈవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చారు. వారంలో ఎవరెవరు ఎలా ఆడారు, ఏం మాట్లాడారో చెబుతూ అందరికీ తిరిగి ఇచ్చేశాడు.

నాగార్జున వెనుక తొమ్మిది కుండలు పెట్టి వున్నాయి. వాటిపై తొమ్మిది మంది ఇంటి సభ్యుల ఫోటోలు వున్నాయి. బాలాదిత్య, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా- రోహిత్, కీర్తి భట్, శ్రీహాన్, అభినయ, షానీ ఫోటోలు కుండలపై అతికించి వున్నాయి. మై డియర్ నైన్.. మీరు బిగ్‌బాస్ హౌస్‌కి ఆడటానికి రాలేదు, చిల్ అవ్వడానికి వచ్చారా అని ప్రశ్నిస్తూ అన్ని కుండలను పగులగొట్టారు. ఆ వెంటనే ఈ తొమ్మిది మందిలో వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్‌ని ఆదేశించారు నాగార్జున. ఎవరికి ఎక్కువ స్టాంప్స్ వస్తాయో వారు ఎలిమినేట్ అవుతారని స్పష్టం చేశారు. అందరిలోకి శ్రీసత్య, షాని, వాసంతిలకు ఎక్కువ స్టాంప్స్ పడ్డాయి.

ఇంటిలో ఒక నిర్ణయం తీసుకున్నట్లే... ప్రేక్షకుల నిర్ణయం ఎంటో తెలుసుకుందామని చెప్పారు నాగ్. ముగ్గురిలో రెండు డెసిషన్‌లు మ్యాచ్ అయిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని తెలిపారు. కాసేపటికి నాగార్జున కార్డు తీసుకుని చూపించగా.. అందులో షానీ పేరుంది. దీంతో షానీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్. అనంతరం ఒకే ఒక జీవితం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాగ్ సతీమణి అమల, హీరో శర్వానంద్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ .. అమల కోసం నిర్ణయం సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే జీవితం’ అంటూ పాట పాడారు. ఆర్జే సూర్య.. ప్రభాస్, రాంచరణ్‌ల వాయిస్‌తో అలరించారు.

అనంతరం ఎలిమినేట్ అయిన షానీ తన లగేజ్‌తో వేదికపైకి వచ్చాడు. కానీ ఇది రెగ్యులర్ ఎలిమినేషన్‌లా జరగలేదు. షానీ జర్నీ వీడియోను చూపించడం గానీ, ఇంటి సభ్యులతో గానీ మాట్లాడించలేదు. ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్‌లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి అందరికీ వీడ్కోలు పలికాడు షానీ. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ ముందే చెప్పడంతో ఆదివారం ఎవరి వంతు రాబోతోందోనని ఉత్కంఠ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.