close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు : హౌస్‌లో చెర్రీ సందడి.. ఓ నిజం తెలుసుకున్న నాగ్, ఈ వారం ఆ ముగ్గురూ సేఫ్

Monday, September 20, 2021 • తెలుగు Comments

వీకెండ్‌ వచ్చిందంటే చాలు బాగా రెడీ అవుతారు హౌస్‌మేట్స్‌. వాళ్ల అందాలను చూసి మెచ్చుకునే నాగ్‌ హౌస్‌లో చేసిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ చీవాట్లు కూడా పెడతాడు. దీంతో అప్పటిదాకా ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగిన కంటెస్టెంట్లు నాగ్‌ రాగానే క్లాస్‌లోకి వచ్చిన మాస్టర్‌ని చూసి భయపడ్డ పిల్లల్లాగా గప్‌చూప్‌ అయిపోతుంటారు. నేటి ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌, మాస్ట్రో టీమ్‌.. నితిన్‌, నభా నటేష్‌, తమన్నా ముఖ్య అతిథులుగా వచ్చి సందడి చేశారు. మరోవైపు రెండో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. దీంతో హౌస్‌లో ఎవరు సేఫ్ జోన్‌లో వున్నారు... ఎవరు డేంజర్ జోన్‌లో వున్నారు.. ఆ విశేషాలేంటో చదివేయండి.

ఎప్పటిలానే శనివారం హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ను చూపించారు. అందులో జెస్సీ, షణ్ముఖ్ లు శ్రీరామచంద్ర గురించి మాట్లాడుకున్నారు. అమ్మయిలందరినీ కావాలనే కవర్ చేస్తున్నాడని.. అలా చేస్తే పులిహోర అనే ముద్ర పడుతుందే కానీ ఓట్లు రావంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు షణ్ముఖ్. అనంతరం జైల్లో ఉన్న సన్నీను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. ఉమాదేవి, లోబోల రొమాన్స్ చూడడానికి కంపరంగా అనిపించింది.

బిగ్ బాస్ టీవీలో 'మన వినోద విశ్వం' అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తోన్న యాడ్ ను ప్రసారం చేసి రామ్ చరణ్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. స్టేజ్ పైకి వచ్చిన చరణ్ ను.. 'ఆర్ఆర్ఆర్' ఎలా వస్తుందని అడిగారు నాగ్. దానికి చరణ్.. 'నాక్కూడా అదే క్వశ్చన్.. మేం నటించిన షాట్స్ కూడా మాకు చూపించట్లేదు..' అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆచార్య గురించి మాట్లాడుతూ.. తన తండ్రితో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని.. బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకొచ్చారు చరణ్. సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి చరణ్ ను అడిగి తెలుసుకున్నారు నాగ్. ప్రస్తుతం తేజు చాలా బావున్నాడని.. మెల్లగా కోలుకుంటున్నాడని తెలిపారు చరణ్.

ఆ తరువాత చరణ్ ను బిగ్ బాస్ టీవీలో చూసిన హౌస్ మేట్స్ థ్రిల్ ఫీల్ అవుతూ.. అందరూ లేచి నిల్చొని ఆయనకు వెల్కమ్ చెప్పారు. అది చూసిన నాగ్.. 'గుర్తు పెట్టుకుంటాను.. నేనొచ్చినప్పుడు ఎవరూ లెగలేదు' అంటూ హౌస్ మేట్స్‌ని సరదాగా ఆటపట్టించాడు. అనంతరం రామ్ చరణ్ 'ఈరోజు నేను కొంచెం లోబోలాగా డ్రెస్ అయి వచ్చినా' అంటూ చెప్పగా.. లోబో మోకాళ్లపై నుంచొని దండం పెట్టాడు.

ఆ తరువాత నాగ్.. ఉమాదేవిని పరిచయం చేస్తూ.. 'చాలా మంచి మనిషి.. మాటలు కొంచెం అప్పుడప్పుడూ.. బూతులు మాట్లాడుతుంది' అనగానే చరణ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంది. 'మీతో వర్క్ చేయాలనుకుంటున్నా' అంటూ శ్వేతా.. రామ్ చరణ్ కి చెప్తుండగా.. 'పైకి అలా మాట్లాడుతుంది చరణ్.. కానీ చాలా వైల్డ్' అంటూ కౌంటర్ వేశారు. నటరాజ్ మాస్టర్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు.. చరణ్ తో తనకున్న మెమరీను గుర్తు చేసుకున్నారు. ఒక దగ్గర డిన్నర్‌ జరుగుతుంటే రామ్‌చరణ్‌ తనకు ప్లేట్‌లో ఫుడ్‌ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడని భావోద్వేగానికి లోనయ్యాడు. యాంకర్ రవిని ఆటపట్టించాడు రామ్ చరణ్. ప్రియాంకను పరిచయం చేస్తూ.. 'ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదంటూ' నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

ప్రియాంక.. చెర్రీకి తానో పెద్ద అభిమానిని అని, మీతో ఫొటో దిగాలనుందని మనసులో మాట బయటపెట్టింది. దీంతో చెర్రీ.. బయటకొచ్చాక తప్పకుండా కలుద్దామన్నాడు. అయితే మిమ్మల్ని రెండు రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంచేసుకుంటామని ప్రియ తన కోరిక వెలిబుచ్చింది, మధ్యలో కలగజేసుకున్న నాగార్జున.. దీనికి రాజమౌళి ఒప్పుకోడని కౌంటరిచ్చారు. ఇక షణ్ముఖ్‌ చెర్రీకి గాల్లో ముద్దులు పంపి తన అభిమానం చాటుకున్నాడు. తనకోసం ఓ పాట పాడమని చెర్రీ అడగడంతో శ్రీరామ్‌ అందుకు వెంటనే బంగారు కోడిపెట్ట పాట పాడాడు. కాజల్‌ను అందరూ పనిమనిషిని చేశారని నాగ్‌ చెప్పగా పని చేసే తను పనిమంతురాలు అని ప్రశంసించాడు చెర్రీ.

సిరిని పరిచయం చేస్తూ.. 'గొంతులో మైక్ పెట్టేసుకుందంటూ' నాగ్ కామెంట్ చేశారు. యానీని పరిచయం చేసినప్పుడు చరణ్ ఆమెని పొగుడుతూ కొన్ని మాటలు చెప్పారు. ఆ తరువాత షణ్ముఖ్.. చరణ్ కి లవ్యూ సర్ అని చెప్పాడు. అది విన్న నాగ్.. 'ఇప్పుడు నీకు చెప్తున్నాడు.. రోజూ మాత్రం దీప్తికి చెప్తాడు' అని సెటైర్ వేయగా.. అందరూ నవ్వేశారు.

హమీదకి చరణ్ హాయ్ చెప్పగా.. 'హమీదాను ప్రేమించడానికి శ్రీరామ్ ట్రై చేస్తున్నాడు.. కానీ హమీద మాత్రం ఇప్పటివరకు ఎస్ చెప్పలేదు' అంటూ డైలాగ్స్ వేశారు నాగ్. ఆ తరువాత చరణ్ కు మానస్ ని ఇంట్రడ్యూస్ చేశారు నాగ్. హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ.. 'డోంట్ బి టూ హ్యాపీ.. చాలా సెట్ చేయాలి' అంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్.

నాగార్జున దగ్గర నుంచి కాసేపు బిగ్ బాస్ స్టేజ్ తీసుకున్న రామ్ చరణ్.. 'మాస్ట్రో' టీమ్ ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. సినిమాలో హీరో నితిన్ అంధుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ స్టేజ్ మీదకు కూడా అలానే నటిస్తూ వచ్చాడు నితిన్. తమన్నా దగ్గరుండి మరీ నితిన్‌ను చేయిపట్టుకుని తీసుకొచ్చింది. ఇక అలా స్టేజ్ మీదకు వచ్చిన నితిన్.. రామ్ చరణ్ ముందు అంధుడిగా నటించాడు. ఏదీ కనబడనట్టుగా రామ్ చరణ్ బాడీని పట్టుకుని తడిమాడు. సినిమాలో అందరినీ ఆడించావ్.. ఇక్కడ కూడా అవసరమా? అని నితిన్‌కు చెర్రీ కౌంటర్ వేశాడు.

సినిమా సంగతుల గురించి చరణ్.. నితిన్ ని అడగ్గా.. సైకో విలన్ గా యాక్ట్ చేసిన తమన్నా చెబుతుందంటూ ఆమెకి మైక్ ఇచ్చాడు నితిన్. ఆ తరువాత ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు.. రిస్క్ అవసరమా అనిపించింది కానీ నటుడిగా ఇలాంటి సినిమాలు చేయాలని ఒప్పుకున్నా.. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుందని నితిన్ హర్షం వ్యక్తం చేశాడు. నభా నటేష్‌, తమన్నా, చెర్రీ, చరణ్‌ అంతా కలిసి స్టెప్పులేస్తూ స్టేజీని ఓ ఊపు ఊపేసి వీడ్కోలు తీసుకున్నారు.

ఇక ఇంటిసభ్యుల తీరును సెట్‌ చేయడానికి సిద్ధమైన నాగ్‌ టాస్కుల్లో ప్రాణం పెట్టారు కానీ బిహేవియర్‌ మాత్రం బాలేదని క్లాస్ పీకారు. ఎవరెవరు తమ బిహేవియర్‌ బాలేదు అనుకుంటున్నారో లేచి నిలబడమనగానే ఉమాదేవి, సిరి, లోబో, శ్వేత, యానీ, శ్రీరామ్‌, సన్నీ లేచి నిలబడ్డారు. మొదట ఉమా.. నామినేషన్‌ సమయంలో బూతులు మాట్లాడాను అని తన తప్పు ఒప్పుకుంది. దీనిపై నాగ్‌ క్లాస్‌ పీకడంతో ఉమ గుంజీలు తీస్తూ క్షమాపణలు కోరింది. యానీ మాస్టర్‌ నిలబడగా.. అరవడం తప్పేం కాదన్నాడు నాగ్‌. తర్వాత లోబో వంతు రాగా.. గతంలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడివి అని నాగ్‌ గుర్తు చేయడంతో ఇప్పుడు ఏడు మాత్రమే తాగుతున్నానని చెప్పాడు. షో అయిపోయేలోపు సిగరెట్‌ మానేస్తానని ప్రామిస్‌ చేశాడు లోబో.

నామినేషన్‌లో అందరికీ మానవత్వం లేదన్నావు, మరి హమీదా ముఖం మీద పెయింట్‌తో ఎందుకు కొట్టావు? అని నాగ్‌ ప్రశ్నించడంతో శ్వేత పశ్చాత్తాపపడింది. నాది కచ్చితంగా తప్పే అని అంగీకరించిన శ్వేత అందరి ముందే రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టుకుంది. తర్వాత సన్నీ.. తనను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎందుకు ఎంచుకున్నారో చెప్పమని నాగ్‌ను ఆవేదనతో అర్థించాడు. దీంతో నాగ్‌.. సిరి వైపు చూస్తూ.. సన్నీ నీ షర్ట్‌ లోపల చేయి పెట్టి బెటాన్‌ తీశాడా? అని ప్రశ్నించాడు. అందుకామె అవునని చెప్పింది.

సాక్ష్యం కోసం షణ్ముఖ్‌ను అడగ్గా అతడు కూడా సన్నీ చేయి పెట్టాడు అని చెప్పాడు. దీంతో నాగ్‌ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి టాస్క్‌లోని వీడియో ప్లే చేసి చూపించాడు. ఇందులో సన్నీ.. సిరి షర్ట్‌ లోపల చేయి పెట్టలేదని రుజువైంది. దీంతో సిరి అతడికి సారీ చెప్పి హగ్గిచ్చింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరి క్యారెక్టర్‌ను తప్పు పట్టకూడదని నాగ్‌ హెచ్చరించాడు. ఈ సమస్యను క్లియర్ చేసినందుకు నాగార్జునకు థాంక్స్ చెప్పాడు సన్నీ. ఆ తర్వాత యానీ మాస్టర్‌, లోబో, ప్రియాంక సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz