close
Choose your channels

AP CM YS Jagan:ఆరోగ్యాంధ్రప్రదేశే జగన్ లక్ష్యం.. ఏపీ వైద్య రంగంలో కీలక మైలురాయి, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ఓపెనింగ్

Friday, September 15, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక రాష్ట్రం అద్భుతంగా పురోగతి సాధించడానికి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ విషయాన్ని మేధావులు తరచూ చెబుతుంటారు. దీనిని ఆచరణలో పెట్టి ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేది విద్యేనని జగన్ ఏ వేదికపై మైక్ అందుకున్నా తరచుగా చెబుతారు. అంతేకాదు.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కార్పోరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా వుంటాయి. ఎంతోమంది దేశ, విదేశీ ప్రముఖులు, మేధావులు, ఆర్ధిక వేత్తలు జగన్ దూరదృష్టిపై ప్రశంసలు కురిపించారు. భావి భారత పౌరులను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గాను జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ధ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రతి పేద విద్యార్ధి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు జగన్.

విద్యతో పాటు వైద్యానికి ప్రాధాన్యత :

విద్యతో పాటు వైద్య రంగానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం . వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద వందలాది వ్యాధులను చేర్చారు. దీనితో పాటు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాజాగా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 17 నూతన ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రారంభానికి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటేనే ఎంతో ప్రయాసపడాలి. అలాంటిది ఒకేసారి 17 వైద్య కళాశాలలు ప్రారంభోత్సవమంటే జగన్ కృషి ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నేళ్లలో ప్రైవేట్ వైద్య కాలేజీలే తప్పించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్కటి లేదు. ఈ పరిస్థితిని మార్చాలని జగన్ నిర్ణయించారు.

17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.8,480 కోట్ల వ్యయం:

దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో ఈ 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మకమైన నిర్ణయంగా మేధావులు చెబుతున్నారు. దీనితో పాటు వాటికి అనుబంధంగా ఎన్నో ఆసుపత్రులను సకల సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేశారు. ఈ 17 కాలేజీల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో వున్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు వచ్చి చేరుతున్నాయి. ప్రతి కాలేజీలో ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య వచ్చే నాలుగేళ్లలో 966 నుంచి 1,767కు పెరుగుతున్నాయి. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లను జగన్ వెచ్చిస్తున్నారు. ఈరోజు విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు జగన్.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ :

వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీల్లో అడ్మిషన్లు మొదలవుతాయి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్నది వైసీపీ ప్రభుత్వ ధ్యేయం. ఇక్కడ మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి కాలేజీలో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్, 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, అధునాతన లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నారు.

మెడికల్ కాలేజీలు ఎక్కడంటే :

2024-25 విద్యాసంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెల్లో.. 2025-26లో పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండల్లో కాలేజీలు మొదలవుతాయి. ఇవి కాకుండా సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాలలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తిరుపతిలో శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీనితో పాటు హృద్రోగ బాధితుల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగుతోన్న జగన్ :

మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలనే లక్ష్యంతో జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉచిత మందులు, అర లక్ష మంది కొత్త సిబ్బంది నియామకాన్ని చేపట్టారు. అలాగే ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్. దీని ద్వారా హెల్త్ క్యాంపులు నిర్వహించి.. అనారోగ్య సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ కేసులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా చికిత్స అందించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశంచారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.