close
Choose your channels

Heavy Rainfall:హైదరాబాద్‌లో దంచి కొట్టిన వాన.. విద్యాసంస్థలకు సెలవు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Tuesday, September 5, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రగతి నగర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట, నాంపల్లి, ఆల్వాల్, బొల్లారం, ఉప్పల్, మలక్‌పేట్, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్ధుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మ్యాన్‌హోల్స్ వున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు.

విద్యాసంస్థలకు సెలవు :

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అటు ఇవాళ, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో గంట పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం వుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.

అధికారులతో తలసాని సమీక్ష:

మరోవైపు.. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమీషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో ఆయన మాట్లాడారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి మట్టాలను పర్యవేక్షించాలని , నాలాల విషయంలో అప్రమత్తంగా వుండాలని మంత్రి సూచించారు. నగర ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, విపత్కర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.