AAP Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఒక్క పైసాకైనా ఆధారాలున్నాయా , కోర్ట్ చెప్పిందిదే : ఆప్ మంత్రి అతిషి
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ స్కాం జరిగిందనడానికి ఆధారాలు లేవంటూ సీబీఐ ప్రత్యేక కోర్ట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆప్ నేత , ఢిల్లీ మంత్రి అతిషి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన ఏడాదిగా బిజెపి నేతలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. బిజెపి నేతలు చేసిన ఆరోపణలే సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్‌లో వచ్చాయన్నారు. 6 నెలలకు పైగా సీబీఐ,ఈడీలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయని, 500కు పైగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అతిషి చురకలంటించారు. రూ.100 కోట్ల కిక్ బ్యాక్‌లు పొందారని తమపై ఆరోపణలు చేశారని.. ఈ వంద కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని పదే పదే చెప్పారని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిన్న రౌస్ అవెన్యూ కోర్టు రాజేష్ జోషి , గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ ఇచ్చిందన్నారు. 85 పేజీల ఆర్డర్ ఇచ్చిందని..ఈ ఆర్డర్ బిజెపి నేతలు చదివి ఉంటారని అనుకుంటున్నానంటూ అతిషి చురకలంటించారు. ఒక్క పైసాకు సంబంధించి కూడా సీబీఐ,ఈడీ వద్ద ఆధారాలు లేవని కోర్ట్ చెప్పిందని ఆమె గుర్తుచేశారు.
ఆ కిక్ బ్యాక్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేదు :
రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారని.. కిక్ బ్యాగ్‌లు ఇచ్చారని చెప్పారని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం , కిక్ బ్యాక్ చెల్లింపులకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్పిందని ఆమె గుర్తుచేశారు. సాక్షులు చెప్పిన దాని ప్రకారం చెల్లింపులు జరిగినట్లు పరిగణించలేమని కోర్ట్ చెప్పినట్లు అతిషి తెలిపారు. అసలు ముందు చెప్పిన 100 కోట్ల కిక్ బ్యాక్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేదని, ఫస్ట్ రూ.100 కోట్లు అన్నారని, తర్వాత 30 కోట్లు అంటున్నారని వాటికి కూడా ఆధారాలు లేవని ఆమె చురకలంటించారు. రాజేష్ జోషి ద్వారా రూ.30 కోట్లు ఢిల్లీకి వచ్చాయని...అలాగే గోవాకు వెళ్లాయని ఆరోపించారని ఆమె అన్నారు.
గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసింది రూ.19 లక్షలే :
వారి దగ్గర వీరి నంబర్ ఉంది... వీరి దగ్గర వారి నెంబర్ ఉంది కాల్స్ చేసుకున్నారు.. ఇలాంటి అంశాలు ఆధారాలుగా పరిగణించలేమని కోర్ట్ తెలిపిందని అతిషి గుర్తుచేశారు. డిజిటల్‌గా కానీ హవాలా ఆపరేటర్ వద్ద కానీ డబ్బు తరలించినట్లు ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం పేర్కొందన్నారు. స్వతంత్ర ఆధారాలు ఏవి దర్యాప్తు సంస్థ సేకరించలేదని కోర్టు చెప్పిందని..
గడచిన 6 నెలలు గా ఈడీ, సీబీఐ అధికారులు గోవాలో తిష్ట వేశారని ఆమె పేర్కొన్నారు. గోవాలో ఆప్‌కి పనిచేసిన వెండర్స్ వద్ద తనిఖీలు, విచారణ చేశారని.. చివరికి గోవా ఎన్నికల్లో ఆప్ రూ.19 లక్షలు నగదు ఖర్చు చేసిందని చెప్పారని అతిషి గుర్తుచేశారు.
మా నిజాయితీ ఏంటో దర్యాప్తు సంస్థలే చెప్పాయి :
ఆప్ అత్యంత నిజాయితీ పార్టీ అని దర్యాప్తు సంస్థల తేల్చేశాయని.. అల్లరి అల్లరి చేస్తున్న బిజెపి నేతలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. ఛార్జ్‌షీట్‌లు సీబీఐ, ఈడీలు రాయడం లేదని.. ప్రధాన మంత్రి కార్యాలయంలో సిద్ధం చేస్తున్నారని అతిషి ఆరోపించారు. వారు రాసినదానికి ఆధారాలు సేకరించమని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు తమపై దాడులు చేస్తున్నారని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు చెప్పారని అతిషి గుర్తుచేశారు.
మోడీ క్షమాపణలు చెప్పాలి :
ఏ ఆధారాలతో ఫోన్లు ధ్వంసం చేసారని అధికారులు ముందే చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. అబద్ధపు ఆధారాలను సృష్టిస్తున్నారని.. సంజయ్ సింగ్ పేరు పేర్కొన్నారని, ఆయన లీగల్ నోటీసు పంపగానే తప్పు జరిగిందని క్షమాపణ కోరారని అతిషి చురకలంటించారు. మద్యం కుంభకోణంలో వస్తున్న పేర్లు అన్ని అవాస్తవాలని, అసలు కుంభకోణం జరగలేదని ఆమె తేల్చిచెప్పారు. ప్రధాని , బిజెపి నేతలు దేశ ప్రజల క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ,మనీష్ సిసోడియాలతో పాటు ఆప్ పార్టీని బద్నాం చేస్తున్నారని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా కూడా ఆధారాలు సమర్పించలేదని అతిషి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout