2016 బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ (ఫిమేల్)

2016 కి గుడ్ బై చెబుతూ 2017కి వెల్ కమ్ చెబుతున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్స్, బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ (మేల్), వివాదలు...గురించి తెలుసుకున్నాం కదా..! ఇక ఇప్పుడు 2016లో తమ అందం, అభినయంతో ఆకట్టుకుని బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ అందించిన కథానాయికలు గురించి క్లుప్తంగా మీకోసం...!

IndiaGlitz presents a review of the best performances of the year.

రమ్యకృష్ణ..!

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించి మెప్పించిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. హలో బ్రదర్, అన్నమయ్య, ఘరానా బుల్లోడు, క్రిమినల్...ఇలా నాగార్జున, రమ్యకృష్ణ కలిసి నటించిన సినిమాలు అన్నీదాదాపు సక్సెస్ అవ్వడంతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే సోగ్గాడే చిన్ని నాయనా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా రమ్యకృష్ణ మరోసారి అద్భుతంగా నటించి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రేష్మి గౌతమ్..!

గుంటూరు టాకీస్ లో సువర్ణ పాత్రలో నటించి యూత్ కు బాగా దగ్గరైంది రేష్మి గౌతమ్. ఈ చిత్రంలోని హాట్ సాంగ్ లో నటించిన రేష్మి బాగా పాపులర్ అయ్యింది. అందంతో పాటు విలేజ్ గర్ల్ గా పాత్రకు తగ్గట్టు అభినయించి మెప్పించింది. రేష్మి నటించిన ఈ సాంగ్ సినిమాలోనే కాకుండా యుట్యూబ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. యుట్యూబ్ లో అత్యధికంగా చూసిన తెలుగు పాటల్లో ఒకటిగా ఈ పాట నిలవడం విశేషం.

సమంత..!

ఈ సంవత్సరం సమంత 24, జనతా గ్యారేజ్, అ ఆ, బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించింది. బ్రహ్మోత్సవం మినహా సమంత నటించిన మిగిలిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి. అ ఆ సినిమాలో మరో్సారి బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ అనేలా సమంత నటించింది. ఆ క్రెడిట్ అంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కే చెందుతుంది. ఎన్టీఆర్ తో సమంత నటించిన రభస సినిమా ఫ్లాప్ అవ్వడంతో జనతా గ్యారేజ్ సినిమా ఎలా ఉంటుందో అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. ఈసారి ఎన్టీఆర్ తో కలిసి సమంత నటించిన జనతా గ్యారేజ్ బ్లాక్ బష్టర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సంవత్సరంలో ఎక్కువ సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన హీరోయిన్ అంటే సమంతే..!

నివేథా థామస్..!

తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ నివేథా థామస్. నేచురల్ స్టార్ నాని సరసన నివేథా థామస్ జెంటిల్ మన్ సినిమాలో నటించింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపొందిన జెంటిల్ మన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో నివేథా థామస్ క్యారెక్టర్ కు తగ్గట్టు నటించి శభాష్ అనిపించుకుంది. ఇంకా చెప్పాలంటే...ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది అని చెప్పచ్చు.

రీతువర్మ..!

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించిన రీతువర్మ నటించిన చిత్రం పెళ్లిచూపులు. చిన్న సినిమాగా రిలీజైన పెళ్లిచూపులు సంచలన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ప్రజెంట్ అమ్మాయిలు కెరీర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు..? పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తున్నారు..? అనే క్యారెక్టర్ లో రీతువర్మ చాలా బాగా నటించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించిన రీతువర్మ ఏదో సినిమా చేసేయాలి అనుకోకుండా మంచి పాత్రను ఎంచుకోవడం అభినందనీయం..!

నిహారిక కొణిదెల..!

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నాగబాబు డాటర్ నిహారిక. ఒక మనసు అనే సినిమా ద్వారా నిహారిక హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన నిహారిక నటించింది. డైరెక్టర్ రామరాజు సున్నితమైన ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలి ప్రయత్నంలో పాత్రకు తగ్గట్టు బాగానే నటించినా...రెండో సినిమాను ఇప్పటి వరకు ఎనౌన్స్ చేయలేదు. పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలనుకుంటుందట నిహారిక. నూతన సంవత్సంలో విభిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

గౌతమి..!

సీనియర్ హీరోయిన్ గౌతమి నటించిన తాజా చిత్రం మనమంతా. ఈ చిత్రంలో గౌతమి మధ్యతరగతి మహిళగా నటించింది. కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి అనుకుంటుంది. అనుకోకుండా విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం వస్తుంది. అయితే...తన కుటుంబాన్ని వదలి వెళ్లలేక, ఈ విషయం చెప్పలేక తనలో తనే మదనపడే క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో గౌతమి అభినయం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. చాలా కాలం తర్వాత తెర పైకి వచ్చిన గౌతమి తన నటనతో ఆకట్టుకుని బెస్ట్ పర్ ఫార్మర్ అనిపించుకుంది.

కీర్తి సురేష్..!

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత రైల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే...ఈ మలయాళ భామ తన నటనతో అలరించి నాని సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. నాని హీరోగా నటిస్తున్న నేను లోకల్ సినిమాలో నటిస్తుంది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న నేను లోకల్ కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్ అనతి కాలంలోనే మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాల్లో కూడా నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం.

నందితా శ్వేత..!

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కథానాయిక నందితా శ్వేత. నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికిపోతావు చిన్నివాడా చిత్రం ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నందితా శ్వేతా పిఎ రంజిత్, సెల్వరాఘవన్, రాధామోహన్, దురై సెంథిల్ కుమార్ తదితర దర్శకులతో వర్క్ చేసింది. తొలి చిత్రంలోనే బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ ఇచ్చింది. అల్లు అర్జున్ సైతం నందితా శ్వేత పర్ ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయి కంగ్రాట్స్ చెప్పారంటే ఏరేంజ్ లో పర్ ఫార్మెన్స్ ఇచ్చిందో ఊహించుకోవచ్చు.

2016కి గుడ్ బై చెబుతూ 2017కి వెల్ కమ్ చెబుతున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్స్, బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ (మేల్), వివాదాలు... గురించి తెలుసుకున్నాం కదా..! ఇక ఇప్పుడు 2016లో తమ అందం, అభినయంతో ఆకట్టుకుని బెస్ట్ ఫర్ ఫార్మెన్స్ అందించిన కథానాయికలు గురించి క్లుప్తంగా మీకోసం...